పవర్ స్టార్ జగన్‌ను ఫాలో అవుతున్నారా?
జగన్ కార్యక్రమాలపై మీడియా పూర్తి ఫోకస్ పెట్టకుండా పవన్ అడ్డుపడుతున్నారా అన్న చర్చ అయితే జరుగుతోంది. ఒకవేళ నిజంగానే అడ్డుపడుతుంటే దానివల్ల పవన్ కు వచ్చే ఉపయోగం ఏమిటి? ఎవరి కోసం అడ్డుకుంటున్నారన్నదే తేలాలి.
సినిమాల్లో ట్రెండ్ సెట్ చేస్తానని డైలాగులు చెప్పే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోమాత్రం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నారా. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పలువురికి అదే సందేహం మొదలైంది. అంటే వాస్తవంలో మాత్రం జగన్ సెట్ చేసిన ట్రెండ్‌లో పవన్ నడుస్తున్నారని అర్థమైపోతోంది. ఏ విషయం తీసుకున్నా జగన్ అడుగుజాడల్లో పవన్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిపోతోంది. మరి ప్రశ్నించటానికే పుట్టిన జనసేన అధ్యక్షుడు ఒకరిని అనుసరించే రాజకీయాలు ఎందుకు చేస్తున్నారో జనసేన అభిమానులకే కాదు ఎవరికీ అర్ధం కావటం లేదు.
సమస్య ఏదన్నా తీసుకోండి. రాజధాని ప్రాంతంలోని రైతుల విషయం నుండి మొన్నటి మిర్చి రైతుల సమస్య వరకూ ప్రతి అంశాన్నీ జగన్ చేపట్టిన తర్వాతే పవన్ స్పందిస్తున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే జగన్ స్పందించిన వెంటనే పవన్ కూడా ఫాలో అవుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతోందంటే ఎవరూ చెప్పలేకున్నారు? కాకతాళీయమనుకుంటే ఏదో ఒకసారి జరిగితే అనుకోవచ్చు. కానీ ఎక్కువ సార్లు ఒకే విధంగ జరుగుతోందంటే ఏదో జరుగుతోందనే ఎవరైనా అనుమానిస్తారు?
రాజధాని ప్రాంతంలో రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని జగన్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం పెట్టుకున్నారు. వెంటనే పవన్ అక్కడ వాలిపోయారు. తర్వాత ప్రత్యేకహోదా అంశంపై జగన్ వివిధ ప్రాంతాల్లో యువభేరి నిర్వహించారు. యువతనే లక్ష్యంగా చేసుకుని భారీ సభలు నిర్వహించారు. వెంటనే పవన్ కూడా ప్రత్యేకహోదాపై మూడు సభలు పెట్టారు. తర్వాత అగ్రిగోల్డ్ బాధితుల కోసం జగన్ నిరసన తెలపగానే పవన్ కూడా వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు సంఘీభావంగా ఓ సభ నిర్వహించేసారు.
తర్వాత 10వ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీపై జగన్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కడిగిపారేసారు. వెంటనే పవన్ కూడా ఓ చిన్న ప్రకటన ఇచ్చి ఊరుకున్నారు. అదే విధంగా తాజాగా రైతులు, మిర్చి రైతుల సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధరల కోసం జగన్ రెండు రోజుల దీక్ష చేయగానే పవన్ కూడా ఓ స్టేట్ మెంట్ ఇచ్చేసారు. సరే, ఆ ప్రకటనలో అసలు విషయమే లేదనుకోండి అది వేరే సంగతి.
ఇలా..ఏ విషయం చూసినా జగన్‌ను పరవ్ స్టార్ ఫాలో అవ్వటం వెనుక ఏదైనా వ్యూహముందా అన్నది తేలటం లేదు. జగన్ కార్యక్రమాలపై మీడియా పూర్తి ఫోకస్ పెట్టకుండా పవన్ అడ్డుపడుతున్నారా అన్న చర్చ అయితే జరుగుతోంది. ఒకవేళ నిజంగానే అడ్డుపడుతుంటే దానివల్ల పవన్ కు వచ్చే ఉపయోగం ఏమిటి? ఎవరి కోసం అడ్డుకుంటున్నారన్నదే తేలాలి.