పవన్ ‘అనంత’ టూర్ తో జగన్ కు లాభం...ఎలాగబ్బా?

పవన్ ‘అనంత’ టూర్ తో జగన్ కు లాభం...ఎలాగబ్బా?

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అనంతపురం పర్యటన వైసిపికి అనుకూలంగా మారనుందా? క్షేత్రస్ధాయిలో జరిగిన పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే పవన్ వైఖరి వల్ల వైసిపికి లాభమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ విషయం ఏమిటంటే, అనంతపురం జిల్లాలో కరువుయాత్ర చేస్తానని చెప్పిన పవన్ చివరకు టిడిపి నేతల ఇళ్ళల్లో విందు రాజకీయాలు చేశారు. దాంతో జిల్లాలోని జనాలు మండిపోతున్నారు.

‘2019లో రైతుల కన్నీళ్ళు తుడిచే వాళ్ళకే తన మద్దత’ని చెప్పిన పవన్ మంత్రి పరిటాల సునీత, ఎంఎల్ఏలు ప్రభాకర్ చౌదరి, ఫిరాయింపు ఎంఎల్ఏ అత్తార్ చాంద్ భాష, వరదాపురం సూర్య నారాయణరెడ్డి ఇళ్ళకు వెళ్ళారు. పవన్ చేసిన ఈ పని వల్ల రాజకీయాలకు సంబంధం లేని తటస్తుల్లో ఆగ్రహం తెప్పించింది.

పోయిన ఎన్నికల్లో ఈ జిల్లాలో ఓటర్లు దాదాపు ఏకపక్షంగా టిడిపిని ఆదరించారు. మొత్తం 12 సీట్లలో టిడిపి పది చోట్ల గెలవగా వైసిపి రెండు స్ధానాల్లో మాత్రమే గెలిచింది. అయితే, తర్వాత కదిరి ఎంఎల్ఏ చాంద్ భాష కూడా టిడిపిలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. దానికితోడు మూడున్నరేళ్ళ చంద్రబాబునాయుడు పాలనలో జనాల్లో బాగా వ్యతిరేకత మొదలైంది.

మొన్నటి వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆ విషయం స్పష్టంగా కనబడింది కూడా. ఎవరూ ఊహించని విధంగా జగన్ కు జనాలు బ్రహ్మరథం పట్టారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి, వైసిపి, జనసేనలు పోటీ చేస్తే ఓట్ల చీలిక ఖాయమని జనాలు అనుకుంటున్నారు. అయితే, తాజాగా తన అనంత పర్యటనలో టిడిపి, జనసేన ఒకటే అని పవన్ చాటి చెప్పినట్లైంది.

సమస్యలు తెలుసుకోవటానికి ఎవరూ మంత్రులు, అధికారపార్టీ ఎంఎల్ఏల ఇళ్ళకు వెళ్ళరన్న విషయం అందరికీ తెలిసిందే. సమస్యల పరిష్కారం విషయంలో పవన్లో చిత్తశుద్ది ఉంటే మంత్రులు, ఎంఎల్ఏల ఇళ్ళకు ఎందుకు వెళ్ళినట్లు? ఇటువంటి ప్రశ్నలే జిల్లాలో మొదలయ్యాయి. దాంతో టిడిపి, జనసేన ఒకటే అని జనాల్లో చర్చ జరుగుతోంది.

అంటే వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఓటు వేస్తే అది టిడిపికి మద్దతు ఇచ్చినట్లే అన్నది స్పష్టమైపోయింది. పైగా అందరు ఎంఎల్ఏల ఇళ్ళకు వచ్చి ఆతిధ్యం స్వీకరిస్తానని బహిరంగంగా చెప్పటం కూడా పవన్ కు నష్టం చేసేదే. అందువల్లే చంద్రబాబు విధానాలు నచ్చని జనాలు ప్రత్యామ్నాయంగా వైసిపి గురించి ఆలోచించేట్లు పవనే ఊతమిచ్చారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos