వైసిపిలోకి పనబాక దంపతులు ?

వైసిపిలోకి పనబాక దంపతులు ?

వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ప్రకంపనలే సృష్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లోగా వైసిపి పునాదులు మరింత బలోపేతం అయ్యే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో 10 అసెంబ్లీ సీట్లకు గాను వైసిపి 7 చోట్ల గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుత పాదయాత్రలో కనబడుతున్న జనస్పందన చూస్తే వైసిపి బలం మరింత పెరగటం ఖాయమనే అనిపిస్తోంది.

ఇంతకీ  విషయం ఏమిటంటే, త్వరలో మరింత మంది నేతలు వైసిపిలో చేరటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో పాతుకుపోయిన పనబాక దంపతులు త్వరలో వైసిపిలో చేరుతారంటూ ప్రచారం ఊపందుకున్నది. గతంలో కూడా ఈ ప్రచారం జరిగినా  తాము కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేది లేదని అప్పట్లో పనబాక దంపతులు చెప్పారు.

అయితే సాధారణ ఎన్నికలు తరుముకొచ్చేస్తున్నాయి. ఒకపుడు కేంద్రంలో మంత్రిగా పనిచేసిన పనబాక లక్ష్మి మూడున్నరేళ్ళుగా మౌనంగా ఉన్నారు. ఎందుకంటే వారింకా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. అయితే, కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో అంత సీన్ లేదన్న విషయం తెలిసిందే. కాబట్టి కాంగ్రెస్ ను విడిచిపెట్టి ఏదో ఒక పార్టీలో చేరకపోతే రాజకీయ భవిష్యత్తుండదన్న విషయం దంపతులు గ్రహించారు.ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసిపిలో చేరిన విషయం తెలిసిందే.

అందుకే ఏదో ఓ పార్టీలో చేరేబదులు వైసిపిలోనే చేరితే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. జగన్ పాదయాత్ర మొదలైన దగ్గర నుండి అన్నీ పార్టీలు ఎటూ జన స్పందనను గమనిస్తూనే ఉన్నాయి. పనబాక దంపతులు కూడా డిటోనే. అందులోనూ సొంత జిల్లా నెల్లూరులో జనాధరణను ప్రత్యక్షంగా చూస్తున్నారు. అందుకనే వాళ్ళు పునరాలోచనలో పడ్డారట.

పనబాక దంపతులు గనుక వైసిపిలో చేరితే లక్ష్మికి తిరుపతి లేదా బాపట్ల లోక్ సభ టిక్కెట్టు దక్కే అవకాశం ఉందట. అదే సమయంలో లక్ష్మి భర్త పనబాక కృష్ణయ్యకు గూడూరులో అసెంబ్లీ టిక్కెట్టు వచ్చే అవకాశం ఉంది. గూడూరులో వైసిపి తరపున గెలిచిన సునీల్ టిడిపిలోకి ఫిరాయించిన తర్వాత వైసిపికి అక్కడ గట్టి నాయకుడు లేరు. కాబట్టి ఆ స్దానాన్ని కృష్ణయ్యతో భర్తీ చేసే అవకాశం ఉందని ప్రచారం జోరందుకుంది. త్వరలోనే పనబాక దంపతుల విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos