ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచి రాజకీయ వేడి కొనసాగుతుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వ్యుహా, ప్రతివ్యుహాలతో ఇప్పటి నుంచే రానున్న ఎన్నికలకు ప్రణాళికలు రచిస్తున్నాయి. గుడివాడలో కొడాలి నాని ఓటమే లక్ష్యంగా టీడీపీ పక్కా స్కెచ్ సిద్దం చేసుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచి రాజకీయ వేడి కొనసాగుతుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వ్యుహా, ప్రతివ్యుహాలతో ఇప్పటి నుంచే రానున్న ఎన్నికలకు ప్రణాళికలు రచిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన టీడీపీ.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రణాళికలు రచిస్తుంది. మరోవైపు సంక్షేమం అజెండాగా ముందుకు సాగుతున్న వైసీపీ.. మరోసారి అధికారాన్ని నిలుపుకునేలా పావులు కదుపుతుంది. అయితే ఇరు పార్టీలు కూడా రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో గెలుపును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. వై నాట్ 175 అంటున్న వైఎస్ జగన్.. కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. టీడీపీ కూడా కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో గుడివాడ ఒకటి. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని ఓటమికి వ్యుహాలు రచిస్తుంది. కొడాలి నానిపై దివంగత హరికృష్ణ, సినీ నటుడు ఎన్టీఆర్‌లకు సన్నిహితుడనే ముద్ర ఉంది. అయితే టీడీపీతో రాజకీయ జీవితం ప్రారంభించిన కొడాలి నాని.. ఆ తర్వాత వైసీపీలో చేరారు. పదేళ్లుగా వైసీపీలోనే కొనసాగుతున్నారు. టీడీపీ నేతలపై, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై విమర్శలు చేయాలంటే కొడాలి నాని ముందుంటారు. నందమూరి ఫ్యామిలీ నుంచి చంద్రబాబు పార్టీని లాక్కున్నారని ఆరోపించే నాని.. జూనియర్ ఎన్టీఆర్‌కు మద్దతుగా కూడా కామెంట్స్ చేస్తుంటారు.
జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ మినహా నందమూరి కుటుంబంలోని మిగిలినవారిపై కూడా విమర్శలు చేసేందుకు కూడా నాని వెనకడారనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై ఆయన విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది టీడీపీకి చాలా సందర్భాల్లో ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో గుడివాడలో టీడీపీ జెండా ఎగరవేయాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. గత ఎన్నికల్లో కొడాలి నానిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్.. ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు.
అయితే గుడివాడను సీరియస్‌గా తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అక్కడ ఎవరిని బరిలో నిలుపుతారనే చర్చ సాగుతుంది. కొంతకాలంగా గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్గ్ గా ఉంటున్న రావి వెంకటేశ్వరరావు.. తానే అభ్యర్ధి అని ప్రచారం చేసుకుంటున్నారు. ఆ తర్వాత గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్తిగా పోటీ చేయనున్నారని.. పారిశ్రామికవేత్త ఎన్నారై వెనిగండ్ల రాము పేరు వినిపించింది. గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన పలు కార్యక్రమాలు నిర్వహించారు. అయితే వెనిగండ్ల రాము విషయంలో టీడీపీ అధిష్టానం నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు.
అయితే గుడివాడపై స్పెషల్ ఫోకస్ పెట్టిన టీడీపీ అధిష్టానం.. అక్కడి నుంచి బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలనే ఆలోచనలో ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయి సమీకరణాలను అంచనా వేస్తూ అభ్యర్థి విషయంలో కసరతస్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే గుడివాడ టీడీపీ అభ్యర్థి విషయంలో ఓ అనుహ్యమైన పేరు తెరమీదకు వచ్చింది. దివంగత టీడీపీ నేత, సినీ హీరో నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డిని గుడివాడ బరిలో దింపాలని టీడీపీ అధిష్టానం చూస్తుందని సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ సాగుతుంది.
వాస్తవానికి నందమూరి తారకరత్న.. రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. ఈ క్రమంలోనే టీడీపీ అధిష్టానంతో చర్చలు జరిపారు. పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పం వెళ్లిన తారకరత్నకు అక్కడ ఆకస్మికంగా గుండెపోటు రావడం.. ఆ తర్వాత 20 రోజులకు పైగా ప్రాణాలతో పోరాడి తారకరత్న తుదిశ్వాస విడవడం జరిగిపోయింది. తారకరత్న మరణం తర్వాత ఆయన కుటుంబానికి బాలకృష్ణ అండగా నిలిచారు.
అయితే తారకరత్న రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్న సమయంలో.. ఆయన గుడివాడ నుంచి బరిలో దిగే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గుడివాడ నుంచి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డిని దింపడం ద్వారా.. కొడాలి నానికి చెక్ పెట్టవచ్చని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. గుడివాడలో నందమూరి కుటుంబంలో నుంచి ఒకరిని పోటీకి దింపడం కంటే మంచి అవకాశం మరొకటి లేదని టీడీపీ అగ్రనేతలు అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తోంది.
నందమూరి కుటుంబం నుంచి కాకుండా వేరే ఇతర వ్యక్తులైతే కొడాలి నాని ఇష్టానుసారంగా మాట్లాడే అవకాశం ఉంటుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా అలేఖ్య రెడ్డిని బరిలో నిలుపడం ద్వారా.. తారకరత్న సెంటిమెంట్ కూడా కలిసివచ్చే ఉండే అవకాశం ఉందని టీడీపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. తారకరత్న మరణం తర్వాత ఆ కుటుంబానికి అండగా ఉంటామని బాలకృష్ణ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం గుడివాడ నుంచి అలేఖ్య అభ్యర్థితత్వాన్ని బాలకృష్ణనే స్వయంగా సూచించారని ప్రచారం జరుగుతుంది. త్వరలో జరగనున్న టీడీపీ మహానాడు తర్వాత ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే గుడివాడలో అలేఖ్య రెడ్డి బరిలో నిలిస్తే టీడీపీ విజయం ఖాయమని టీడీపీ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నారు.
