ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం చంద్రబాబు అమెరికాలోని కాలిఫోర్నియా,  శాన్ జోస్, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో, వాషింగ్టన్ డిసి, న్యూయార్క్, న్యూ జెర్సీ నగరాల్లో మాత్రమే పర్యటించాలి. కానీ తన పర్యటనలో లేని డల్లాస్ కు చంద్రబాబు ఎందుకు వెళ్లినట్లు?

రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేగుతున్న ‘డల్లాస్ మెయిల్స్’ విషయంలో కొత్త కోణం వెలుగు చూసింది. షెడ్యూల్లో లేని డల్లాస్ లో చంద్రబాబు పర్యటించినపుడే చంద్రబాబుపై ఫిర్యాదు వెలుగు చూడటం గమనార్హం. చంద్రబాబునాయుడు అమెరికా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఎప్పుడో పూర్తయ్యాయి. పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటిస్తున్న చంద్రబాబు బృందం ఏ నగరాల్లో పర్యటించాలి, ఎవరెవరితో కలవాలన్న విషయాలు కూడా చాలా కాలం క్రితమే నిర్ణయమైంది. ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలు ముందుగానే నిర్ణయమవటం చాలా సహజం. అనుకోని అవాంతరాలు ఎదురైనపుడు మాత్రమే మార్పులు, చేర్పలు చేసుకుంటాయి.

అయితే, చంద్రబాబు వెళ్లింది కేవలం పెట్టుబడుల కోసమే అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే అమెరికాలో ఉన్న టిడిపి మద్దతుదారులు పలువురితో సమావేశాలు ఏర్పాటు చేసారు. చంద్రబాబు డల్లాస్ నగరంలో పర్యటిస్తుండగానే మెయిల్స్ ఫిర్యాదు వెలుగు చూసాయి. దాంతో రాష్ట్రంలో పెద్ద దుమారం మొదలైంది.

చంద్రబాబుకు వ్యతిరేకంగా మెయిల్స్ ద్వారా ఫిర్యాదులు అందటం వెనుక వైసీపీ హస్తముందంటూ మంత్రులు, టిడిపి నేతులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. వైసీపీ హస్తముందన్న అనుమానాలకు ఇంతవరకూ ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోయినా జగన్మోహన్ రెడ్డిపై దేశ ద్రోహ నేరం కేసు పెట్టాలంటూ మంత్రులు డిమాండ్ చేసేస్తున్నారు.

అయితే, చంద్రబాబు పర్యటనకు సంబంధించి కొత్త కోణం వెలుగు చూసింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం చంద్రబాబు అమెరికాలోని కాలిఫోర్నియా, శాన్ జోస్, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో, వాషింగ్టన్ డిసి, న్యూయార్క్, న్యూ జెర్సీ నగరాల్లో మాత్రమే పర్యటించాలి.

కానీ తన పర్యటనలో లేని డల్లాస్ కు చంద్రబాబు ఎందుకు వెళ్లినట్లు? డల్లాస్ పర్యటనను ఎవరు రూపొందించారు? డల్లాస్ పర్యటనలో పాల్గొనాలని ఎప్పుడు నిర్ణయమైంది? డల్లాస్ పర్యటన అధికారికమా లేక పూర్తిగా వ్యక్తిగతమా అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి. షెడ్యూల్లో లేని డల్లాస్ కు చంద్రబాబు ఎందుకు వెళ్ళారో ముందు మంత్రులు సమాధానం చెబితే బాగుంటుంది.