రోజాను ఫేస్ చేయటానికి ప్రభుత్వం భయపడుతోందా అన్న అనుమానాలు సర్వత్రా మొదలైంది.
40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు ఓ మహిళకు ఎందుకు భయపడుతున్నారు. ఆ మహిళ వైసీపీ శాసనసభ్యురాలు రోజా కాబట్టేనా? రోజాకు నిప్పు చంద్రబాబు భయపడాల్సిన అవసరం ఏమిటి? అంటే..తన ప్రభుత్వం తప్పులు చేస్తోందని చంద్రబాబుకు తెలుసు కాబట్టేనా? ఆ తప్పులను ప్రతిపక్షంలోని మిగిలిన మహిళలకన్నా రోజా ధాటిగా ఎండగడుతోంది కాబట్టేనా. వాగ్దాటి స్వతహాగా ఉందో లేక సినీప్రపంచమే నేర్పిందో తెలీదు గానీ రాష్ట్రంలోని మంచి వాగ్దాటి గలిగిన కొద్దిమంది మహిళల్లో రోజా కూడా ఒకరు. విషయమేదైనా, సందర్భం ఏదైనా తన స్టైల్ తనదే.
అందులోనూ గడచిన రెండున్నరేళ్ళ చంద్రబాబు పాలనలో గతంలో ఎన్నడూ లేనివిధంగా మహిళలపై అకృత్యాలు పెరిగిపోయాయి. అందులోనూ పార్టీ నేతలు కూడా రెచ్చిపోతున్నారు. టిడిపి నేతల ఆగడాలకు బలైపోయిన మహిళల్లో సొంత పార్టీ వాళ్లూ ఉండటం గమనార్హం. అంటే మహిళలపై ఆగడాల విషయంలో టిడిపి నేతలు సమన్యాయం పాటిస్తున్నట్లే ఉంది. ప్రత్యర్ధులపై మాటలతో రోజా దాడులు చేయటమన్నది టిడిపిలో ఉన్నపుడు కూడా చేసిందే. కాకపోతే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ఇపుడు అధికారంలో ఉంది. అయితే రోజా మాత్రం అప్పుడూ, ఇపుడూ ప్రతిపక్షంలోనే ఉన్నారు. కాబట్టే రోజా మాటల యుద్ధాన్ని చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారేమో.
ఇక, రోజా లేవనెత్తుతున్న అంశాలన్నీ వాస్తవాలేనని పోలీసు రికార్డులే చెబుతున్నాయి. కాబట్టే రోజాను ఫేస్ చేయటానికి ప్రభుత్వం భయపడుతోందా అన్న అనుమానాలు సర్వత్రా మొదలైంది. లేకపోతే, ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తున్న జాతీయ మహిళా సాధికారత సదస్సుకు రోజాను ఎందుకు హాజరుకానీయలేదు? పైగా సదస్సులో పాల్గొనేందుకు రావాల్సిందిగా స్పీకర్ ఆహ్వనాన్ని పంపిన తర్వాత కూడా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసారంటేనే ప్రభుత్వం ఎంత భయపడుతోందో అందరికీ అర్ధమవుతోంది. ఈమాత్రం దానికి ఆహ్వనాలు పంపటం ఎందుకు? అరెస్టులు చేయటం ఎందుకు?
సదస్సును భగ్నం చేయాలని రోజా ప్రయత్నిస్తారని పోలీసులకు సమాచారం ఉందట. నిజంగా మన పోలీసులు మామూలోళ్ళు కాదు. మనుషులను నేరుగా చూడకుండానే వాళ్ళ బుర్రలో ఏముందో చెప్పేయగలరు. బహుశా చంద్రబాబు తర్ఫీదులోనే అంతటి సామర్ధ్యాన్ని సంపాదించుకున్నారేమో? మహిళలపై విచక్షణా రహితంగా దాడులు చేస్తున్న పార్టీ, మహిళలను నిబంధనలకు విరుద్ధంగా చట్ట సభల నుండి సస్పెండ్ చేస్తున్నపార్టీ, ఆడవాళ్ళపై పెరుగుతున్న క్రైం రేటును అరికట్టలేని పార్టీ, ప్రతిపక్ష ఎంఎల్ఏల పొడంటేనే సహించలేని పార్టీనే ఇపుడు మహిళా సాధికారత సదస్సు నిర్వహిస్తోందంటే నిజంగా గ్రేటే.
