జెసి సోదరులపై క్రమశిక్షణ చర్యలంటే మామూలు విషయం కాదు. ఒకవేళ చర్యలు తీసుకోవాలనుకుంటే వీరి రియాక్షన్ ఎలాగుంటుందో చంద్రబాబుకు బాగా తెలుసు. వీరు టిడిపిని వద్దనుకుంటే వెంటనే భారతీయ జనతా పార్టీలోకో లేక వైసీపీలోకో వెళ్ళిపోగలరు.

‘వెనకటి ఎవడో లేస్తే మనిషిని కానన్నాడ’ట. చంద్రబాబునాయుడు వ్యవహారం కూడా అలానే ఉంది. క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదంటూ చంద్రబాబు ఇప్పటికి వందలసార్లు హెచ్చరించే ఉంటారు. ఎవ్వరిపైనా చర్యలు తీసుకోలేదు. అంతెందుకు జెసి కుటుంబం వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నా చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇపుడదే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది.

ఏదో హెచ్చరికలు జారీ చేస్తున్నారే కానీ వివాదాల్లో ఇరుక్కున్న వారిలో ఇంత వరకూ ఎవ్వరిపైనా చంద్రబాబు చర్యలు తీసుకున్నది లేదు. లేకపోతే చంద్రబాబు దృష్టిలో జరుగుతున్నవేవీ క్రమశిక్షణ చర్యలు తీసుకోదగ్గవి కావేమో? సరే, ఏదేమైనా టిడిపి నేతల అత్యుత్సాహం వల్ల పార్టీ, ప్రభుత్వం పరువు బజారున పడుతోందన్నది వాస్తవం.

తాజాగా మొదలైన అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి వివాదం అందరికీ తెలిసిందే. ఆ వివాదంలో పార్టీ బాగా గబ్బు పట్టిపోయింది. విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన గొడవపై జాతీయస్ధాయిలో దుమారం రేగుతున్నా కనీసం ఇండిగో విమాన సిబ్బందికి ‘సారి’ అని కూడా చెప్పకుండానే జెసి తన కుటుంబంతో కలిసి ప్యారిస్ కు వెళ్లిపోవటం పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు.

దివాకర్ రెడ్డే అనుకుంటే సోదరుడు, తాడిపత్రి ఎంఎల్ఏ జెసి ప్రభాకర్ రెడ్డి కూడా వివాదాస్పదుడే. ఇటీవలే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనంతపురంలోనే ఎన్ని బూతులు తిట్టిందీ అందరూ చూసిందే. ఇక ప్రభాకర్ రెడ్డి అల్లుడు దీపక్ రెడ్డి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

ఇక్కడే అందరిలోనూ అనుమానం వస్తోంది. జెసి సోదరులంటే చంద్రబాబు భయపడుతున్నారా? అంటే, అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే, అనంతపురం జిల్లాలో ఇప్పటికీ జెసి సోదరుల ప్రభావం బాగుంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రాయలసీమ నేతలవ్వటమే వీరికి కలిసి వస్తోంది. పైగా తాడిపత్రిలో బలమైన మద్దతుదాలున్నారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తే తప్ప వీరిని ఎవ్వరూ ఓడించలేరు. అందుకే తాడిపత్రిలో వరుసగా సునాయాసంగా గెలుస్తున్నారు. 

అంత బలమైన క్యాడర్ ఉన్న జెసి సోదరులపై క్రమశిక్షణ చర్యలంటే మామూలు విషయం కాదు. ఒకవేళ చర్యలు తీసుకోవాలనుకుంటే వీరి రియాక్షన్ ఎలాగుంటుందో చంద్రబాబుకు బాగా తెలుసు. వీరు టిడిపిని వద్దనుకుంటే వెంటనే భారతీయ జనతా పార్టీలోకో లేక వైసీపీలోకో వెళ్ళిపోగలరు. అందుకనే జెసి బ్రదర్స్ ఎన్ని వివాదాల్లో ఇరుక్కుంటున్నా చంద్రబాబు పట్టనట్లు వదిలేస్తున్నారు.