రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని అమరావతి రాకపై పలురకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. రెండు రోజుల క్రితం ముఖేష్ అమరావతికి వచ్చి చంద్రబాబునాయుడుతో ప్రత్యేకంగా భేటీ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇపుడా భేటీపైనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. అందులోనూ వచ్చే నెలలో జరుగనున్న రాజ్యసభసభ ఎన్నికల చుట్టూతానే ఊహాగానాలు తిరుగుతుగుతుండటం గమనార్హం.

పార్లమెంటులో బడ్జెట్ సమర్పణ నేపధ్యంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి. తర్వాత నుండి జరుగుతున్న పరిణామాలన్నీ అందరికీ తెలిసినవే.  ఈ నేపధ్యంలోనే ముఖేష్ హటాత్తుగా అమరావతికి వచ్చి చంద్రబాబుతో దాదాపు ఆరు గంటల పాటు భేటీ అయ్యారు.

అంత సుదీర్ఘ భేటీ జరిగిందంటే ఏవో ముఖ్యమైన అంశాలపై చర్చలు జరగకుండా ఉండవు కదా? ఆ చర్చలేమిటి? అన్న విషయంపైనే ఊహాగానాలు మొదలయ్యాయి. కొందరేమో ప్రధానమంత్రి నరేంద్రమోడి తరపున చంద్రబాబు వద్దకు రాయబారం మొసుకొచ్చారని కొందరంటున్నారు.  అదేంకాదు, జియో ఉత్పత్తి కేంద్రాన్ని తిరుపతి వద్ద ఏర్పాటు చేయటానికి ముఖేష్ నిర్ణయించుకున్నారట. ఆ విషయాన్ని చెప్పటానికే అంబానీ వచ్చారని మరికొందరు అంటున్నారు.

అయితే ఈ వాదనను కూడా కొందరు కొట్టిపారేస్తున్నారు. ఉత్పత్తి యూనిట్ పెట్టాలనే నిర్ణయాన్ని చెప్పటానికి పనిగట్టుకుని ముఖేషే అమరావతికి రావాల్సిన అవసరం ఎంతమాత్రం లేదంటున్నారు. సరే, పై రెండు కారణాలు కావనే అనుకుందాం? మరి ఎందుకు వచ్చినట్లు? అంటే, త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి తరపున ఒక స్ధానాన్ని అడగటానికే ముఖేష్ వచ్చారనే ప్రచారం టిడిపిలోనే జోరుగా సాగుతోంది.

వచ్చే నెలలో మూడు రాజ్యసభ స్ధానాలకు ఎన్నికలు జరగుతాయి. అందులో టిడిపికి రెండు స్ధానాలు ఖాయం కాగా ఒక్క స్దానం వైసిపికి దక్కే అవకాశాలున్నాయి. టిడిపికి దక్కే రెండింటిలో ఒక్కస్దానాన్ని తమకు కేటాయించాలని చంద్రబాబును ముఖేష్ అడిగారట. రాష్ట్రంలో తమ కంపెనీల వ్యవహారాలను చూసే మాధవరావు అనే వ్యక్తికి రాజ్యసభ స్ధానం ఇప్పిస్తానని ముఖేష్ హామీ ఇచ్చారట. ఆ విషయం మాట్లాడటానికే చంద్రబాబును ముఖేష్ స్వయంగా కలిసారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు.