ఎంఎల్ఏ ఏంటి ? అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవటమేంటి ? అనుకుంటున్నారా ?
ఎంఎల్ఏ ఏంటి ? అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవటమేంటి ? అనుకుంటున్నారా ? ఏం చేస్తాం పరిస్ధితులు అలా వస్తున్నాయి. ఇంతకీ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయిన ఎంఎల్ఏ ఎవరా అనుకుంటున్నారా ? పాడేరు వైసిపి ఎంఎల్ఏనే గిడ్డి ఈశ్వరి. ఎందుకంటే, ఒత్తిడిని తట్టుకోలేకే. గిడ్డిఈశ్వరి టిడిపిలో చేరుతున్నారని జరుగుతున్న ప్రచారం తెలిసిందే కదా ? దాంతో పార్టీ మారే విషయంలో అన్ని వైపులా నుండి ఎంఎల్ఏపై ఒత్తిడి మొదలైంది.

పార్టీలోనే ఉండేట్లుగా ఎంఎల్ఏని బుజ్జగించేందుకు వైసిపి నేతలొకవైపు, పార్టీలోకి ఎలాగైనా లాక్కోవాలని టిడిపి నేతలొకవైపు ఎవరికి వాళ్ళుగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. వీళ్ళ ప్రయత్నాలు జరుగుతుండగానే మండల, గ్రామస్ధాయి నేతలు కూడా ఎంఎల్ఏను కలవటానికి ఇంటికి, కార్యాలయానికి వస్తున్నారు. దాంతో ఒత్తిడిని తట్టుకోలేక గిడ్డి మాయమైపోయారు. ఎవరిని అడిగినా ఎంఎల్ఏ ఎక్కుడుందో తెలీదనే సమాధానం వస్తోంది. ఎవరో ఒకరిద్దరితో మాత్రమే ఎంఎల్ఏ టచ్ లో ఉన్నారు.

బయటనుండి వచ్చే ఫోన్లకు సమాధానం చెప్పాలన్నా వాళ్ళే, బయటవాళ్ళు ఎంఎల్ఏతో మాట్లాడాలన్నా వాళ్లకే ఫోన్ చేయాలి. తమతో మాట్లాడిన వాళ్ళ స్ధాయిని బట్టి ఆ ఒకరిద్దరే ఎంఎల్ఏకి విషయాన్ని చేరవేస్తున్నారు. అవసరం అనుకుంటే ఎంఎల్ఏ వారితో మాట్లాడుతున్నారు లేకపోతే లేదు. జగన్ తో కూడా గిడ్డి అదే విధంగా మాట్లాడినట్లు సమాచారం

.
ఆమె పార్టీ కార్యాలయం నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో కోలాహలంగా మారింది. ఈశ్వరి మాత్రం రహస్య ప్రాంతంలో ఉండి అందరినీ రేపు విజయవాడ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండ్రోజులుగా గూడెంకొత్తవీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులతో పార్టీ మారే విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకున్నారు.

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో మకాం వేసి ఆమెను పార్టీలో ఉండేటట్లు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కరణం ధర్మశ్రీ తదితరులు ఆదివారం మధ్యాహ్నం పాడేరులోని గిడ్డి ఇంటికి వెళ్ళినట్లు సమాచారం. పార్టీ మారుతున్నట్లు అమె బయటకు చెప్పకపోయినా పాడేరులోని ఎంఎల్ఏ కార్యాలయంలో పరిస్థితి చూస్తే అర్ధమైపోతుంది. ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడ తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట.
