ఉద్యోగ, ఉపాధ్యాయ, పట్టభద్రులు హోలు మొత్తం మీద మధ్యతరగతి జనాలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారన్నది స్పష్టం.

అదేమిటో చంద్రబాబునాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఉద్యోగ వర్గానికి సమస్యలే. మొదటిసారి సిఎం అయినపుడు కూడా చంద్రబాబు ఉద్యోగులను వేపుకుతిన్నాడనే ఆరోపణలుండేవి. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వేపుకుతినటమన్నది బాగా ఎక్కువైపోయిందట. దాంతో ఎక్కడికక్కడ ఉద్యోగులు సైలెంట్ గా తిరగబడ్డారు. అందుకే 2003 ఎన్నికల్లో ఓడిపోయారని స్వయంగా చంద్రబాబే ఎన్నోసార్లు చెప్పుకున్నారు. అప్పటి ఎన్నికల్లో ఉద్యోగులు ప్రత్యేకంగా ఉపాధ్యాయవర్గాలు తమకు వ్యతిరేకంగా పనిచేసాయని చంద్రబాబు బహిరంగంగానే ఎన్నోమార్లు చెప్పుకున్నారు కదా?

అందుకనే పదేళ్ళపాటు ప్రతిపక్షంలో కూర్చున్నారు. విచిత్రమేమిటంటే, ప్రతిపక్షంలో కూడా కూర్చోవటాన్ని కూడా చంద్రబాబు క్రెడిట్ క్రిందే తీసుకుంటున్నారు. ఎక్కడ మాట్లాడినా తొమ్మిదేళ్ళు సిఎంగాను పదేళ్ళపాటు ప్రతిపక్షంలో కూర్చున్న సీనియర మోస్ట్ లీడర్ని అని చెప్పుకుంటున్న సంగతి అందరూ చూస్తున్నది. ఒకపార్టీ ప్రతిపక్షంలో కూర్చున్నదంటే అర్ధం ప్రజలు తిరస్కరించారనే. కానీ దాన్ని కూడా చంద్రబాబు అంగీకరించలేకపోతున్నారు.

మూడేళ్ల క్రితం ఎన్నికల్లో చంద్రబాబు మాట్లాడుతూ, తాను మారిన మనిషినని చెప్పుకున్నారు. గతంలో లాగ ఉద్యోగులను ఇబ్బందులు పెట్టనని బహిరంగ సభల్లో కూడా హామీ ఇచ్చారు. సరే అనేక సమీకరణలు కలసివచ్చి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారనుకోండి అది వేరే సంగతి. అయితే, సిఎం అయిన దగ్గర నుండి తమ పట్ల ఆయన పద్దతి మారిందా అంటే ఏమీ లేదనే సమాధానం చెబుతున్నాయి ఉద్యోగ వర్గాలు. వేలాదిమంది ఉద్యోగులను హటాత్తుగా హైదరాబాద్ నుండి వెలగపూడికి తరలించమే అన్నింటికన్నా పెద్ద ఉదాహరణ. ఇక రెండో విషయమేమిటంటే ఉద్యోగులపై టిడిపి నేతల ధౌర్జన్యాలు పెరిగిపోతుండటం.

రెవిన్యూ, పోలీసు, ఫారెస్టు, రవాణాశాఖ ఇలా...చెప్పుకుంటూ పోతే చాలా శాఖల ఉద్యోగలపై నేతల దాష్టికాలు పెరిగిపోతున్నాయి. ఎంఆర్ఓ వనజాక్షిపై ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ దాడి ఘటన రాష్ట్రంలో ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. అదేవిధంగా పలువురు నేతలు, పాకాల, విజయవాడ, నందిగామ తదితర ప్రాంతాల్లో పోలీసులనే బహిరంగంగా ఉరికిచ్చి మరీ కొట్టారు. గుంటూరు జిల్లాలో రెవిన్యూ ఉద్యోగులపై దాడిచేసి మరీ గాయపరిచారు. తాజాగా, విజయవాడలో రవాణాశాఖ కమీషనర్ బాలసుబ్రమణ్యంతోనే దురుసుగా ప్రవర్తించారు ఎంపి కేశినేని నాని, ఎంఎల్ఏ బోండా ఉమ, ఎంఎల్సీ బుద్దా వెంకన్న. కమీషనర్ భద్రతా సిబ్బందిపైనే ఉమ ధౌర్జన్యం చేయటం తాజా సంచలనం.

అదేవిధంగా ఉద్యోగ సంఘాల అంతర్గత విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నది ప్రభుత్వం. ఉద్యోగ సంఘాలను చీల్చింది. ఉపాధ్యాయ సంఘాలను చీల్చింది. ఇలా ఎక్కడికక్కడ తమ సంఘాల మధ్య చీలికలు తేవటాన్ని ఉద్యోగుల జీర్ణించుకోలేకున్నారు. అనేక ఘటనల ప్రభావమే మొన్నటి ఎంఎల్సీ ఎన్నికల ఫలితం. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోటీ చేసిన నాలుగు స్ధానాల్లోనూ టిడిపి చిత్తుగా ఓడిపోయింది. అంటే, ఉద్యోగ, ఉపాధ్యాయ, పట్టభద్రులు హోలు మొత్తం మీద మధ్యతరగతి జనాలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారన్నది స్పష్టం. అదేంటో చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్య తరగతి జనాలు దూరమైపోతుంటారు.