మెట్రో రైల్: చంద్రబాబుకు ఆహ్వానంపై సస్పెన్స్..

Is kcr govt kept naidu away from Metro inauguration
Highlights

  • హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఆహ్వానం అందిందా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.

హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఆహ్వానం అందిందా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. 28వ తేదీ ప్రధానమంత్రి నరేంద్రమోడి చేతుల మీదుగా మెట్రో రైలు ప్రారంభమవుతున్న సంగతి అందరకీ తెలిసిందే కదా? మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కెసిఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు తగ్గట్లే ఏర్పాట్లూ చేస్తోంది.

                                                చంద్రబాబును పిలవాలా ?

ఇన్ని హంగులున్న ఈ ప్రారంభోత్సవానికి చంద్రబాబును పిలిచారా లేదా అన్న సందేహం అందరిలోనూ మొదలైంది. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి చంద్రబాబును ఎందుకు పిలవాలనే ప్రశ్న కొందరిని నుండి వస్తోంది. కానీ చంద్రబాబును పిలవాలనటానికి కొన్ని కారణాలున్నాయి. ఎందుకంటే, 2002 లో మెట్రో రైలు రూపకల్పన జరిగింది చంద్రబాబు హయాంలోనే. కొంత  భూసేకరణ జరిగింది కూడా ఆయన హయాంలోనే. తర్వాత ముఖ్యమంత్రి అయిన వైఎస్ హయాంలో కూడా పనులు వేగంగానే జరిగాయి. సరే, ప్రస్తుత విషయానికి వస్తే చంద్రబాబు ఏపికి ముఖ్యమంత్రి. పైగా కార్యక్రమం జరుగుతున్నది ఉమ్మడి రాజధానిలో. కాబట్టి చంద్రబాబును ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిలవాలని కొందరంటున్నారు.

                                                    పిలిస్తే ఏమవుతుంది ?

తెలంగాణా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి చంద్రబాబును ఎందుకు ఆహ్వనించాలి అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. వారి వాదన ఏంటంటే, కెసిఆర్ సర్కార్ చంద్రబాబును ఆహ్వానించిందే అనుకుందాం. కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబు ఊరుకోరు కదా ? తన హయాంలోనే మెట్రో రైల్ వ్యవస్ధ రూపకల్పన జరిగిందని చెప్పుకుంటారు ప్రధానితో. భూ సేకరణలో తన కృషి ఉందంటారు. మరి, పక్కనే ఉన్న కెసిఆర్ పరిస్ధితేంటి అపుడు ?

నిజానికి మెట్రో రైలు వ్యవస్ధ, భూ సేకరణ మొదలైంది, పనులు మొదలైంది, వేగం పుంజుకున్నది రాష్ట్ర విభజనకు ముందే. కాకపోతే ఫినిషింగ్ టచ్ ఇస్తున్నది కెసిఆర్ ప్రభుత్వమే. సరే, విషయమేదైనా మొత్తం క్రెడిట్ తనకే దక్కాలని కెసిఆర్ అనుకోవటం సహజం. కాబట్టి చంద్రబాబును దూరం ఉంచాలనుకోవటంలో తప్పేమీ లేదని వాదించే వారూ ఉన్నారు. అందుకే ఇటు కెసిఆర్ పేషీలో అయినా, అటు చంద్రబాబు కార్యాలయంలో అయినా చంద్రబాబుకు ఆహ్వానంపై ఎవరూ నోరు మెదపటం లేదు.

 

loader