టిడిపిలో చేరటం ఖాయమేనా ?

First Published 27, Nov 2017, 8:38 AM IST
Is jayaprada rejoining in  tdp
Highlights
  • ‘నవ్యాంధ్ర నిర్మాణానికి చంద్రబాబునాయుడు కృషి అమోఘం’..ఇది చంద్రబాబు గురించి ఒకనాటి అందాల తార, రాజకీయ నేత జయప్రద ఇచ్చిన సర్టిఫికేట్.

‘నవ్యాంధ్ర నిర్మాణానికి చంద్రబాబునాయుడు కృషి అమోఘం’..ఇది చంద్రబాబు గురించి ఒకనాటి అందాల తార, రాజకీయ నేత జయప్రద ఇచ్చిన సర్టిఫికేట్. వచ్చే  ఎన్నికల్లోగా రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఈ తార ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పుడెప్పుడో సమైక్య రాష్ట్రాన్ని వదిలేసి ఉత్తరప్రదేశ్ కు వలస వెళ్ళిపోయిన తారకు ఇంతకాలానికి రాష్ట్రం రాజకీయాలపై మనసు మళ్ళింది. దాంతో ఏ పార్టీలో చేరాలా అన్న సంశయంతో అవస్తులు పడుతోంది.

ప్రతిపక్ష వైసిపిలో చేరాలా ? లేకపోతే అధికార టిడిపిలో చేరాలా ? అన్నది తేల్చుకున్నట్లు లేదు. అందుకనే ఎక్కడ తనకు మంచి అవకాశం వస్తుందా అన్నది పరిశీలించుకుంటోంది. జగన్ పార్టీలో చేరుతున్నారని ఆమధ్య బాగా ప్రచారం జరిగింది. తర్వాత ఏమైందో ఏమో తాజాగా చంద్రబాబ బ్రహ్మాండమంటున్నారు. పైగా కేంద్రంపై విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. కొత్త రాష్ట్రం కాబట్టి అభివృద్ధిలోకి రావాలంటే కేంద్రం సహకారం ఎంతైనా అవసరమట. పనిలో పనిగా ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కని కూడా ఓ మాట అనేశారు లేండి.

నూతన రాజధాని నిర్మాణం మామూలు విషయం కాదు కాబట్టి కేంద్రం పూర్తి స్ధాయిలో సహకరించాలని డిమాండ్ కూడా చేసారు. తాను ప్రస్తుతం ఏ పార్టీలో లేనన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై ఓ నిర్ణయానికి వస్తానని కూడా చెప్పారు. అప్పటికేదో రాష్ట్రప్రజలంతా జయప్రద కోసమే దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నట్లు ? ఆవిడగారికి ఓ రాజకీయ లక్ష్యముందట. అదేంటో ఇపుడు మాత్రం బయటపెట్టరట. ఏ పార్టీలో చేరేది నిర్ణయించుకున్నాక మాత్రమే రాజకీయ లక్ష్యాన్ని ప్రకటిస్తారట. జయప్రద తాజా మాటలు చూస్తుంటే ప్యాకేజి కుదిరితే టిడిపిలోనే చేరుతారేమోననే అనుమానాలు మొదలయ్యాయి.

 

loader