ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిలోంచి సోము వీర్రాజును తప్పించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం చంద్రబాబా లేక మరొకటా అని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంగళవారం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియా ముందుకు వచ్చి తనను బీజేపీ అధిష్టానం తప్పుకోమందని చెప్పి బాంబు పేల్చారు. ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఆ వెంటనే సోము వీర్రాజు స్థానంలో సత్యకుమార్ ఏపీ బీజేపీ పగ్గాలు అందుకుంటారని వార్తలు హల్ చల్ చేశాయి. కానీ ఇక్కడే బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా పావులు కదిపింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ కుమార్తె, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించింది. ఈ నిర్ణయం రాజకీయ వర్గాలను, విశ్లేషకులను సైతం ఆశ్చర్యపడేలా చేసింది. 

పురంధేశ్వరి నియామకం వెనుక చాలా అంశాలను బీజేపీ హైకమాండ్ పరిగణనలోనికి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో ప్రధానమైన అంశం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుది. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన ఆయన.. మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో పాటు కేంద్ర పెద్దలను నానా మాటలు అన్నారు. ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షలు, విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు విమానాల్లో చక్కర్లు కొట్టారు. అలాంటి చంద్రబాబు ఎన్నికల్లో బొక్క బోర్లా పడటంతో సైలెంట్ అయిపోయారు. మోడీని కానీ, బీజేపీని కానీ పల్లెత్తు మాట అనలేదు. 2024 ఎన్నికల నాటికి బీజేపీ, జనసేనలతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు ప్లాన్ చేశారు.

కొద్దికాలం పాటు చంద్రబాబుతో డిస్టెన్స్ మెయింటైన్ చేశారు కమలనాథులు. చివరికి ఢిల్లీలో వారి అపాయింట్‌మెంట్‌ కూడా టీడీపీ అధినేతకు దక్కలేదు. అలాంటిది కర్ణాటక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పాత మిత్రులను దగ్గర చేసుకోవాలని కమలనాథులు భావించారు. ఈ క్రమంలోనే నడ్డా, అమిత్ షాలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆ తర్వాతి నుంచి టీడీపీతో బీజేపీ పొత్తు ఖాయమని ఊహాగానాలు వినిపించాయి. అయితే చంద్రబాబును అంత తేలిగ్గా నమ్మేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. అందుకే అనూహ్యంగా పురంధేశ్వరిని తెరపైకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో , నందమూరి కుటుంబంలో పురంధేశ్వరికి వున్న గ్రిప్ సాధారణమైనది కాదు. ఎన్టీఆర్ కుమార్తెగా ఆమె పట్ల అందరికీ సాఫ్ట్ కార్నర్ వుంది. ఇదే సమయంలో చంద్రబాబుతో పొత్తు కరెక్ట్ కాదనే వాదనా వుంది. సోము వీర్రాజు తొలి నుంచి తెలుగుదేశంతో వద్దే వద్దని పంతంతో వున్నారు. దీంతో కర్ర విరగకుండా, పాము చావకుండా వుండేలా బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది. అదే పురంధేశ్వరి. ఇలా చేయడం వల్ల ఎన్టీఆర్‌, టీడీపీ అభిమానులు, నందమూరి కుటుంబం అండదండలు, కమ్మ సామాజిక వర్గం సపోర్ట్‌ బిజేపీకి మెండుగా వుంటుందని విశ్లేషకులు అంటున్నారు. 

ఇక.. సోము వీర్రాజును తప్పించడానికి కారణమైన మరో కీలకమైన ఫ్యాక్టర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తొలి నుంచి జనసేనానితో సోము వీర్రాజుకు సన్నిహిత సంబంధాలు లేవు. తమకు బీజేపీ కేంద్ర పెద్దల సపోర్ట్ బాగానే వున్నప్పటికీ.. రాష్ట్ర పార్టీ నేతల నుంచి మాత్రం సహకారం అందడం లేదని పలుమార్లు పవన్ కల్యాణే వ్యాఖ్యానించారు. రెండు పార్టీల మధ్య ఏర్పడుతున్న గ్యాప్‌కు సోము వీర్రాజే కారణమని పలుమార్లు బీజేపీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఏపీలో అతిపెద్ద సామాజిక వర్గాన్ని వదలుకోవడం బీజేపీ పెద్దలకు సుతరామూ ఇష్టం లేదు. వారిని మచ్చిక చేసుకుంటే పార్టీ భవిష్యత్తుకు ఎలాంటి ముప్పు వుండదని కమలనాథులు భావించారు. 

అందుకు తగినట్లుగానే కాపు వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులకే పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించారు. తర్వాత పవన్ కల్యాణ్ పొత్తు కుదుర్చుకోవడంతో ఆయన అండతో దూసుకెళ్లాలని భావించింది. అయితే సోము విపరీత పోకడలతో పవన్ ఒక దశలో పొత్తు నుంచి బయటకు రావాలని అనుకున్నట్లుగా కథనాలు వచ్చాయి. దీనికి తోడు టీడీపీ, జనసేనలతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు సోము వీర్రాజు తొలి నుంచి వ్యతిరేకం. పవన్ ఢిల్లీ స్థాయలో లాబీయింగ్ చేసినా సోము తన వ్యూహాలు, పరిచయాలతో పొత్తు పొడవకుండా అడ్డుకుంటూ వచ్చారు. దీనిపైనా పవన్ బీజేపీ పెద్దలకు ఫిర్యాదులు చేశారు.

అన్నింటిని గమనిస్తూ వచ్చిన బీజేపీ పెద్దలకు పవన్ వారాహి యాత్ర సక్సెస్ కావడంతో సినిమా మొత్తం అర్ధమైంది. కాపులు జనసేన పార్టీని తమ సొంత పార్టీగా ఓన్ చేసుకుంటున్నారు. కాపు ఓట్ల కోసం మూడు ప్రధాన పార్టీలు కొట్టుకుంటున్న వేళ.. బీజేపీ ఆ వర్గానికి ఒంటరిగా ఏమాత్రం చేరువ కాలేదు. అంతేకాద.. రాష్ట్ర పార్టీ నాయకత్వంలో ఆ స్థాయిలో ఛరిష్మా వున్న నేత కూడా లేరు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ వంటి సినీ గ్లామర్, కాపులు, ఇతర వర్గాల్లో ప్రజాదరణ వున్న నేతను వదులుకోవడం వ్యూహాత్మక తప్పిదమవుతుందని భావించిన బీజేపీ పెద్దలు.. సోము వీర్రాజుకు సైలెంట్‌గా చెక్ పెట్టారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ అనే ఫ్యాక్టర్ వల్లే సోము వీర్రాజు పదవికి ఎసరొచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.