ఆరోపించిన టీడీపీ నేత గోరంట్ల

వైసీపీ అధినేత జగన్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి రూ.100కోట్లు ఆఫర్ చేసినట్లు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రచారం జరుగుతోందని టీడీపీ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకే జగన్ ఇలా కోట్లు ఆఫర్ చేశారని ఆయన ఆరోపించారు.

‘ప్రతి శుక్రవారం కోర్టులో హాజరయ్యే జగన్‌.. తనపై ఉన్న కేసుల మాఫీకి గాలి జనార్దనరెడ్డి ద్వారా ప్రయత్నిస్తున్నట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి. రాజారెడ్డి హత్యా రాజకీయాలకు వారసుడైన జగన్‌, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని పరిటాలను హత్య చేయించాడు.’ అని ఆరోపించారు.

‘ పరిటాల హత్య కేసులో అజీజ్‌రెడ్డికి జగన్ రూ.25 లక్షలు డబ్బులు ఇచ్చాడు. 2008లో అతడిని ఎన్‌కౌంటర్‌ చేయించడం తెలిసిందే. మైనింగ్‌ మాఫియా, ఓబుళాపురం గనుల వంటి వాటిని ప్రశ్నిస్తున్నాడనే పరిటాలను మొద్దు శ్రీను, నారాయణ, పటోళ్ల గోవర్ధన్‌రెడ్డితో కలిసి హత్య చేయించాడు. ఈ కేసుకు సంబంధించిన సాక్షులను ఒక్కొక్కరిని హత్య చేశారు. ఇప్పటికీ ఆ పరంపర కొనసాగుతోంది. అవినీతి, హత్యా రాజకీయాల్లో పుట్టిన జగన్‌ నన్ను విమర్శించడానికి సరిపోడు’ అని స్పష్టం చేశారు.

 పాదయాత్రలో తనపైన, ఎంపీ మురళీమోహన్‌పైన చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని, వాటిపై జగన్‌కు సవాల్‌ విసురుతున్నానని చెప్పారు.