ప్రజా సంకల్ప యాత్ర అంటే చంద్రబాబునాయుడు నిజంగానే భయపడుతున్నారా? టిడిపి సమన్వయ కమిటి సమావేశంలో చంద్రబాబు మాట్లాడిన తీరుచూస్తుంటే పలు అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రజా సంకల్ప యాత్ర అంటే చంద్రబాబునాయుడు నిజంగానే భయపడుతున్నారా? టిడిపి సమన్వయ కమిటి సమావేశంలో చంద్రబాబు మాట్లాడిన తీరుచూస్తుంటే పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఈనెల 6వ తేదీ నుండి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయాత్రపై టిడిపి నేతలను ఓ కన్నేసి ఉంచమని చంద్రబాబు ఆదేశించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం తేవటానికి పాదయాత్ర చేయనున్నట్లు జగన్ స్పష్టంగా ఎప్పుడో ప్రకటించారు.

అయితే, ఆ విషయంపైనే చంద్రబాబు పార్టీ శ్రేణులకు కొన్ని ఆదేశాలు జారీ చేసారు. జనాల్లో విభజన తేవటానికే జగన్ పాదయాత్ర చేస్తున్నట్లు చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకే పాదయాత్రను నిశితంగా గమనించాలన్నారు. వైసీపీ నేతల్లో నేరప్రవృత్తి ఉంది కాబట్టే పాదయాత్రను గమనించాలని చెప్పటం విచిత్రంగా ఉంది. ఎందుకంటే, ‘పాదయాత్రలో నేరాలు చేస్తారా లేక చేయిస్తారా’ అన్నది గమనించాలట. బాగుంది కదూ చంద్రన్న లాజిక్కు. గతంలో కూడా రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించటానికే తునిలో రైలును దహనం చేసిందిట వైసీసీ. అదేవిధంగా పాదయాత్ర సమయంలో కూడా చేయవచ్చట. అందుకనే జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు చెబుతున్నారు.

చంద్రబాబు చెబుతున్నదంతా బాగానే ఉంది. నిజమే, వైసీపీ అటువంటి చర్యలకే దిగినా లేకపోతే దిగాలని ప్లాన్ వేసినా మరి ఆ విషయాలను పసిగట్టటానికే కదా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్ధ ఉన్నది? అశాంతిని రేకెత్తించటానికే జగన్ పాదయాత్ర చేయబోతున్నట్లు ఇంటెలిజెన్స్ ఏమన్నా చంద్రబాబుకు రిపోర్టు ఇచ్చిందా?
సమాజంలో అశాంతిని రేకెత్తించటానికే వైసీపీ ప్లాన్ చేస్తోందనుకుందాం కాసేపు. పాదయాత్రలో అల్లర్లు జరిగితే జగన్ కే కదా నష్టం ? పోనీ జగన్ కు వచ్చే లాభమేంటో చంద్రబాబు చెప్పగలరా? చంద్రబాబు మాటలు విన్న తర్వాత వైసీపీ ఎంఎల్ఏ రోజా మాట్లాడుతూ, కుట్రల చరిత్ర ఉన్నదే చంద్రబాబుకంటూ మండిపడ్డారు. జగన్ పాదయాత్రను భగ్నం చేయటానికి చంద్రబాబే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అంతేకాకుండా ఎన్టీఆర్ ను పదవిలోనుండి దింపేసిన దగ్గర నుండి మొన్నటి ప్రత్యేకహోదా వరకూ చంద్రబాబు కుట్రలంటూ పెద్ద చాకిరేవే పెట్టారు. మరి ఈ ఆరోపణలకు చంద్రబాబు ఏమని సమాధానం చెబుతారు? గతంలో చంద్రబాబునాయుడు కూడా పాదయాత్ర చేసారు కదా? అప్పట్లో ప్రభుత్వం కూడా ఇదే విధంగా ఆలోచించివుంటే అసలు చంద్రబాబు పాదయాత్ర చేయగలిగే వారేనా అంటూ రోజా ప్రశ్నించారు.
