అన్యాయంగా తనపై కేసులు పెట్టారని, అక్రమంగా తనను జైల్లో పెట్టారంటూ జగన్ మొదటి నుండి చెబుతునే ఉన్నారు. కేసులు వీగిపోవటం చూస్తుంటే మొదటినుండి జగన్ చెబుతున్నదే నిజమవుతుందేమో. అంటే జగన్ పై ఉన్న కేసులను కొట్టేయటానికి ఎంతో కాలం పట్టేట్లు లేదు.
ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి త్వరలో మంచిరోజులు రానున్నాయా? కేసుల నుండి విముక్తి లభించనుందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమేనని అనిపిస్తోంది. అక్రమాస్తులు, అవినీతికి పాల్పడటం లాంటి అనేక కేసులు పెట్టి జగన్ను కాంగ్రెస్ సర్కార్ ముప్పుతిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే కదా? 16 మాసాలు జైల్లో కూడా పెట్టారు. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని జగన్ వీడగానే ఎక్కడ లేని కేసులు పెట్టారు. కాంగ్రెస్ నేత శంకర్ రావు కోర్టులో పిటీషన్ వేయగానే టిడిపి నేత యర్రన్నాయడు కూడా ఆ కేసులో భాగస్వామయ్యారు.
అప్పటి నుండి సిబిఐ అనేక కేసుల్లో జగన్ను విచారిస్తూనే ఉంది. ఆ కేసుల్లోనే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కూడా విచారణ జరుపుతోంది. సరే, ఇవన్నీ చరిత్రనుకోండి అదివేరే సంగతి. వర్తమానమేంటంటే, జగన్ కేసుల్లో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కూడా ఇరుక్కున్నారు. కొంతకాలం జైలు శిక్ష అనుభవించి ప్రస్తుతం బెయిల్ పై బయటవున్న శ్రీలక్ష్మికి పెద్ద ఊరట లభించింది. శ్రీలక్ష్మి కుట్ర, నేరం చేసారనేందుకు ఆధారాల్లేవంటూ సిబిఐ ప్రత్యేక న్యాయస్ధానం కేసులు కొట్టేసింది.
మాజీ ముఖ్యమంత్రి హయాంలోనే అవినీతి, అక్రమాల్లో మంత్రులెవరికీ సంబంధం లేదంటూ కేసులను ఎత్తేసారు కదా? జగన్ తో కుమ్మకై అవినీతికి పాల్పడ్డారంటూ పలువురు మంత్రులు, ఐఏఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలు చాలా కాలం కోర్టుల చుట్టూ తిరిగారు. అయితే, ఒక్కొక్కరిపైనా కేసులు కొట్టేస్తున్నారు. జగన్ అవినీతిలో మంత్రులకు సంబంధం లేక, ఐఏఎస్ అధికారులకూ భాగస్వామ్యం లేక, పారిశ్రామికవేత్తలకూ సంబంధం లేకపోతే జగన్ ఒక్కరే అవినీతికి ఎలా పాల్పడ్డారు?
జగన్ కేసుల్లో ఇరుక్కున్న చాలా మంది బయటపడిపోయారు. మిగిలింది ఒక్క జగన్ మాత్రమే. అసలు అవినీతే జరగలేదని జగన్ చెబుతున్నారు. అన్యాయంగా తనపై కేసులు పెట్టారని, అక్రమంగా తనను జైల్లో పెట్టారంటూ జగన్ మొదటి నుండి చెబుతునే ఉన్నారు. కేసులు వీగిపోవటం చూస్తుంటే మొదటినుండి జగన్ చెబుతున్నదే నిజమవుతుందేమో. అంటే జగన్ పై ఉన్న కేసులను కొట్టేయటానికి ఎంతో కాలం పట్టేట్లు లేదు. నిజంగా అదే జరిగితే వైసీపీకి అంతకన్నా కావాల్సిందేముంటుంది?
