మొత్తానికి ఉద్యోగం ఊడుతుందనో లేకపోతే నియోజకవర్గాల్లో జనాలు తిరగబడతారని భయమో తెలీదు కానీ ఫిరాయింపు ఎంపిలు అవిశ్వాసతీర్మానానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లే కనబడుతోంది. కేంద్రప్రభుత్వంపై ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానం విషయంలో వైసిపి విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

వైసిపి తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన ముగ్గురు ఎంపిలు ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక, కొత్తపల్లి గీతలకు పెద్ద సమస్య ఎదురైంది. పార్టీ ఫిరాయించే విషయం వారి వ్యక్తిగతమే అయినా సాంకేతికంగా మాత్రం పై ముగ్గురు ఎంపిలు వైసిపికి చెందిన వారే. కాబట్టి పై ముగ్గురు ఎంపిల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా స్పీకర్ వారిని వైసిపి ఎంపిలుగానే పరిగణిస్తున్నారు.

అందుకనే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం అంశం మొదలైన దగ్గర నుండి ఫిరాయింపుల్లో టెన్షన్ మొదలైంది. దాంతో ఏం చేయాలో దిక్కుతోచక చంద్రబాబునాయుడుతో మాట్లాడుతున్నారు. అయితే, మారిన రాజకీయ పరిణామాల్లో హటాత్తుగా చంద్రబాబు కూడా ఎన్డీఏలో నుండి బయటకు వచ్చాశారు. అంతేకాకుండా కేంద్రప్రభుత్వంపై స్వయంగా టిడిపి కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టటంతో ఫిరాయింపుల వ్యవహారం ‘పెనం మీద నుండి పొయ్యిలోకి పడినట్లైం’ది.

విప్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎంపి పదవే పొతుందన్న ఆందోళనతో చివరకు చేసేది లేక వైసిపి ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి అనుగుణంగానే ఓటు వేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఇదంతా అవిశ్వాస తీర్మానం స్పీకర్ ఆమోదం పొంది చర్చకు వచ్చి ఓటింగ్ దాకా వెళితేనే లేండి. అయితే, ముందు జాగ్రత్తగానే స్పీకర్ కు అందచేయటానికి వైసిపి తన మద్దతుగా నిలబడే ఎంపిల సంతకాలు సేకరిస్తోంది. అందులో భాగంగానే పిరాయింపులు కూడా సంతకాలు చేశారని సమాచారం.