బ్రేకింగ్ న్యూస్: వైసిపిలోకి మానుగుంట?

First Published 22, Feb 2018, 4:57 PM IST
Is congress leader manugunta joining in ysrcp soon
Highlights
  • కందుకూరు నియోజకవర్గంకు చెందిన మానుగుంట ఈనెల 26వ తేదీన నియోజకవర్గం కేంద్రంలో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు.

మాజీ మంత్రి ప్రకాశం జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు మానుగుంట మహీధర్ రెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు సమాచారం. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న మానుగుంట ఇటీవలే మళ్ళీ క్రియాశీలమవుతున్నారు. జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంకు చెందిన మానుగుంట ఈనెల 26వ తేదీన నియోజకవర్గం కేంద్రంలో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు.

కార్యక్రమానికి రావల్సిందిగా తన మద్దతుదారులందరినీ మానుగుంట పేరు పేరునా పిలిచారు. దాంతో నియోజకవర్గంలో మాజీమంత్రి మళ్ళీ యాక్టివ్ అవుతున్న విషయం స్పష్టమైంది. ఏడాదిన్నరగా నియోజకవర్గంలో మాజీమంత్రి తిరుగుతునే ఉన్నారు. కానీ ఏ పార్టీలోనూ చేరలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్న దృష్ణ్యా క్రియాశీలం కావాలని మానుగుంట నిర్ణయించుకున్నారు.

మానుగుంటను టిడిపిలోకి చేర్చుకోవాలని కొందరు గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ ఎంచేతనో కుదరలేదు. నియోజకవర్గాల పెరగవన్న విషయం స్పష్టమవటంతోనే  మాజీ మంత్రి టిడిపిలోకి చేరటానికి ఇష్టపడలేదని సమాచారం. అదే సమయంలో నెల్లూరు వైసిపి ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా మానుగుంటతో చర్చలు జరిపారు. మానుగుంటను పార్టీలోకి చేర్చుకునే విషయాన్ని జగన్ తో కూడా ఎంపి మాట్లాడినపుడు జగన్ కూడా సానుకూలంగా స్పందిచారట.

పాదయాత్ర మొదలైనప్పటి నుండి జగన్ కు లభిస్తున్న ప్రాజాధరణ విషయాన్ని మానుగుంట తన మద్దతుదారుల వద్ద ప్రస్తావించారట. దాంతో మానుగుంట వైసిపిలో చేరటం ఖాయమని ప్రచారం మొదలైంది. అదే సమయంలో జిల్లాలో జగన్ పాదయాత్రకు లభిస్తున్న జనాల స్పందనను మాజీమంత్రి జాగ్రత్తగా గమనిస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో జగన్ పాదయాత్ర పూర్తయ్యేలోగా వైసిపిలో చేరవచ్చని పార్టీ వర్గాలు చెప్పాయి. నిజానికి వైసిపికి కూడా జిల్లాలో సీనియర్ నేతల కొరత పట్టి పీడిస్తోంది. కావాల్సినంతమంది ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలున్నా నేతలు మాత్రం తక్కువే. కాబట్టి మానుగుంటలాంటి సీనియర్ వైసిపిలో చేరితే లాభముంటుందని పార్టీ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి.

loader