రాజ్యసభ ఎన్నికల్లో సిఎం రమేష్ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నారనే ప్రచారం టిడిపిలో పెద్ద కలకలం రేపుతోంది. ప్రస్తుతం టిడిపి ఎంపిగా ఉన్న సిఎం పదవీ కాలం ఏప్రిల్ లో ముగుస్తోంది. తనను మళ్ళీ రాజ్యసభకు పంపాలని రమేష్ చంద్రబాబునాయుడును అడిగారట. అయితే, చంద్రబాబు తిరస్కరించారనే ప్రచారం టిడిపిలో కొద్ది రోజులుగా జరుగుతోంది.

ఏప్రిల్లో ఖాళీ అయ్యే మూడు స్ధానాల్లో రెండు టిడిపికి ఒకటి వైసిపికి దక్కుతాయి. అయితే, ఎంఎల్ఏల  సమీకరణల్లో ఏమైనా తేడాలు వస్తే మాత్రం చెప్పలేం. వైసిపికి దక్కుతుందని అనుకుంటున్న మూడో స్దానంపైన కూడా చంద్రబాబు కన్నేశారు. రాజ్యసభ ఎన్నికల్లో వైసిపిని దెబ్బ కొట్టటమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు.

ఒకవేళ మూడో సీటును కూడా గెలుచుకునేంత బలం ఉంది అనుకుంటే అప్పుడు చంద్రబాబు ఏం చేస్తారనే విషయంపై టిడిపిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటువంటి నేపధ్యంలోనే సిఎం రమేష్ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయటానికి ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం ఊపందుకున్నది. ఇందులో భాగంగానే పలువురు ఎంఎల్ఏలతో రమేష్ మాట్లాడుకున్నారట.

వైసిపిలో నుండి టిడిపిలోకి ఎంఎల్ఏల ఫిరాయింపుల్లో రమేష్ కూడా కీలకమే. కాబట్టి తాను స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తే తనకు ఓటు వేయాలంటూ రమేష్ ఫిరాయింపు ఎంఎల్ఏలతో కూడా మాట్లాడుకుంటున్నారనే ప్రచారం ఊపందుకున్నది. అదే విధంగా బిజెపి నేతలతో కూడా మాట్లాడుతున్నారట. మొత్తం చంద్రబాబుతో సంబంధం లేకుండానే సిఎం రమేష్ పావులు కదుపుతున్నారా? అంటూ పలువురు నేతలు ఆశ్చర్యపోతున్నారు.