చంద్రబాబునాయుడు ఎంతో మోజుపడి ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ఫైబర్ నెట్ ప్రాజెక్టు ఫెయిలైందా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే చెప్పక తప్పదు. రాజధాని ప్రాంతమైన కృష్ణాజిల్లాలోనే ఈ ప్రాజెక్టు విఫలమైంది. ఒక్క కృష్ణా జిల్లాలోనే కాదు తొలిదశలో కనెక్షన్లు ఇచ్చిన చాలాచోట్ల ఫెయిలైనట్లే కనబడుతోంది. తొలిదశలో 1.10 లక్షల కనెక్షన్లు తీసుకున్నవారంతా తమకు కనెక్షన్లు వద్దంటూ నెత్తీ నోరు మొత్తుకుంటున్నారంటే ప్రయోగం ఎంతగా విఫలమైందో అర్దమైపోతోంది.

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు భారీ స్కెచ్ చేశారు. రాష్ట్రం మొత్తం మీద లక్షలాది కనెక్షన్లు ఇవ్వటం ద్వారా ప్రచారం చేసుకోవాలని అనుకున్నారు. అందుకే రూ. 149 కే ఇంటర్నెట్, టెలిఫోన్, కేబుల్ టివి అంటూ ప్రభుత్వం ఊదరగొట్టింది. ఇంత చవకలో మూడు కనెక్షన్లు ఇవ్వటం నిజానికి సాధ్యం కాదు. కానీ చంద్రబాబు చెప్పినమాటలను జనాలు నమ్మి కనెక్షన్లు తీసుకోవటానికి ముందుకొచ్చారు. మామూలు కేబుల్ కనెక్షన్లు లేని చోట కూడా ఫైబర్ నెట్ పనిచేస్తుందని జనాలను చంద్రబాబు నమ్మించారు.

దాంతో ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో లక్షమంది కనెక్షన్లు తీసుకున్నారు. పోయిన నెలలో ఈ ప్రాజెక్టును రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రారంభమైన తర్వాత ఫైబర్ నెట్ లోని లోపాలు బయటపడుతున్నాయ్.  ఈ విషయం కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేటలో స్పష్టమైంది. ఈ నియోజకవర్గంలో ఎంఎల్ఏ శ్రీరామ్ తాతయ్య, ఎంఎల్సీ టిడి జనార్ధన్ పట్టుబట్టి ప్రాజెక్టును అమలు చేయించారు. తీరుచూస్తే అసలు బండారం బయటపడింది.

బయటపడిన సమస్యలేంటంటే ఫైబర్ నెట్లో సమస్యలు వస్తే సరిచేయటానికి టెక్నీషియన్లు లేరు. తమ మధ్య గొడవలతో వినియోగదారుల సమస్యలను ఆపరేటర్లు పట్టించుకోవటం మానేసారు. సంబంధిత అధికారులు కూడా  పట్టించుకోవటం లేదు. రూ. 4 వేలు పెట్టి కొనుగోలు చేసిన సెట్ టాప్ బాక్సుల్లో సాంకేతిక సమస్యలను సరిచేసే వారు లేరు. ఫలితంగా సేవలు పనిచేయటం లేదు.

ఇన్ని సమస్యలతో విసిగిపోయిన వినియోగదారులు మళ్ళీ మామూలు కేబుల్ కనెక్షన్లే తీసుకుంటున్నారు. ఫలితంగా ఫైబర్ నెట్ వర్క్ కనెక్షన్లు 8 వేల నుండి 300కి పడిపోయాయి. ఇక్కడ మాత్రమే కాదు ఫైబర్ నెట్ ఏర్పాటు చేసిన మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్ధితి కనబడుతోందని ఆరోపణలు వినబడుతున్నాయ్. మొత్తం మీద చంద్రబాబు ఏదో ఆలోచిస్తే ఆచరణలో ఇంకేదో అవుతోంది.