వచ్చే ఎన్నికల్లోగా రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుతున్నాయా? అలాగనే చంద్రబాబునాయుడు చెబుతున్నారు. సరే, ఇప్పటికి చంద్రబాబు ఈ విధంగా చాలాసార్లే చెప్పారనుకోండి అదివేరే సంగతి. శనివారం వెలగపూడి సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది. ఆ సందర్భంగా మాట్లాడుతూ, నియోజకవర్గాల పునర్విభజనపై ఢిల్లీ నుంచి సానుకూల సంకేతాలున్నాయని చంద్రబాబు చెప్పారు.

నియోజకవర్గాల పెంపుపై సానుకూలంగా స్పందించటం చూస్తుంటే రాష్ట్రం విషయంలో కేంద్ర వైఖరిలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోందన్నారు. అంతేగాక ప్రధానితో భేటీ తర్వాత రాష్ట్ర సమస్యలు పరిష్కారమయ్యే వాతావరణం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అయితే, విభజన హామీలను అమలు చేయకపోతే కోర్టుకు వెళతానన్న తన వ్యాఖ్యలపై కొందరు అతిగా ఫోకస్ చేశారని సిఎం అభిప్రాయపడ్డారు. అలాగే, సహజహక్కును వినియోగించుకోవడంలో తప్పేముంది? అంటూ నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్టు మీడియాలో వచ్చిన వార్తలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసారు.

మూడున్నరేళ్ళుగా అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలంటూ చంద్రబాబు డిమాండ్ చేస్తున్నవిషయం అందరికీ తెలిసిందే. 175 సీట్లను 225కి పెంచాలంటూ చంద్రబాబు ఇప్పటికి ఓ వందసార్లు కేంద్రాన్ని అడిగుంటారు. ఎందుకంటే, నియోజకవర్గాల సంఖ్య పెరగటం చంద్రబాబుకు చాలా అవసరం. లేకపోతే వచ్చే ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో తిరుగుబాట్లు ఖాయం. వైసిపి నుండి 23 మంది ఎంఎల్ఏలు టిడిపిలోకి ఫిరాయించారు.

వారందరికీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు హామీ ఇచ్చే ఫిరాయింపులకు ప్రోత్సహించారు. అటువంటిది వారికి టిక్కెట్లు ఇవ్వకపోతే ఇబ్బందులు తప్పవు. అదే సమయంలో టిడిపి నేతలు కూడా ఫిరాయింపు నియోజకవర్గాల్లో టిక్కెట్లను ఆశిస్తున్నారు. నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి అందరికీ  టిక్కెట్లు ఇస్తానంటూ వారిని జో కొడుతున్నారు. అందుకే నియోజకవర్గాల పెంపుపై చంద్రబాబు అంత పట్టుదలగా ఉన్నారు.