చంద్రబాబును ఇరికించేస్తున్న కేంద్రం

Is center pushing chandrababu in to problems
Highlights

  • తాజాగా కాపులకు రిజర్వేషన్ బిల్లు తిరస్కరణ లీకు వ్యవహారమే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

చంద్రబాబునాయుడును కేంద్రప్రభుత్వం బాగా ఇరికించేస్తోందా? ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ అవుననే అనిపిస్తోంది. తాజాగా కాపులకు రిజర్వేషన్ బిల్లు తిరస్కరణ లీకు వ్యవహారమే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. బడ్జెట్ తో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మొత్తం రాజకీయంలో బిజెపి ఒకరకంగా సేఫ్ గానే ఉంది. ప్రధానప్రతిపక్షమైన వైసిపి కూడా సేఫ్ జోన్లోనే ఉంది. ఎటు తిరిగీ టెన్షన్లో పడింది చంద్రబాబే అనటంలో సందేహం లేదు.

చంద్రబాబు, టిడిపి కేంద్రమంత్రులు, టిడిపి ఎంపిలు పార్లమెంటులో ఎంత అరిచి గీపెట్టినా కేంద్రం ఏమాత్రం లెక్క చేయలేదు. ఆ విషయాన్ని రాష్ట్రంలోని జనాలందరూ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూసిందే. సరే, అదే సమయంలో ప్రత్యేకహోదా ఇవ్వకపోతే తమ ఎంపిలు రాజీనామాలు చేస్తారంటూ వైసిపి అధ్యక్షుడు ఏప్రిల్ 6వ తేదీని గడువుగా ప్రకటించేశారు. దాంతో చంద్రబాబుపై ఒత్తిడి పెరిగిపోయింది. ఇపుడేమంత ఒత్తిడి ఉండదుకానీ ఏప్రిల్ 6వ తేదీ వైసిపి ఎంపిలు రాజీనామాలు చేసిన తర్వాత మొదలౌతుంది చంద్రబాబుకు అసలు సినిమా.

ఇటువంటి నేపధ్యంలోనే కాపులకు రిజర్వేషన్ కల్పించటం సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం తేల్చేయటం చద్రబాబుకు పెద్ద దెబ్బే. కాపులను బిసిల్లోకి చేరుస్తానని ఆచరణ సాధ్యంకాని హామీని పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చారు. ఈమధ్యనే కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మంత్రివర్గంలోను తర్వాత అసెంబ్లీలోనూ తీర్మానం చేయించి అమలు కోసం ఢిల్లీకి పంపారు.

ఢిల్లీకి పంపేటప్పుడే అసెంబ్లీ చేసిన తీర్మానం వీగిపోతుందని చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా నెపం కేంద్రప్రభుత్వం మీద వేసేసి తాను చోద్య చూద్దామనుకున్నారు. చంద్రబాబు వ్యూహాన్ని కనిపెట్టిన కేంద్రం సరిగా రాజకీయం బాగా హాటు హాటుగా ఉన్న సమయంలోనే లీకులు వదిలిపెట్టింది. దాంతో చంద్రబాబు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒకవైపు ఏ విషయంలోనూ సహకరించని కేంద్రం, ఇంకోవైపు ఒత్తిడిపెంచుతున్న వైసిపి మధ్యలో కాపు రిజర్వేషన్ బిల్లు తిరస్కరణ. ఇదంతా చూస్తుంటే చంద్రబాబును ఉద్దేశ్యపుర్వకంగా కేంద్రం బాగా ఇరికించేస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయి.

loader