Asianet News TeluguAsianet News Telugu

అసెంబ్లీలో బిజెపినే ప్రతిపక్షం: చంద్రబాబుకు చుక్కలే

  • సోమవారం నుండి జరుగబోయే అసెంబ్లీ సమావేశాల్లో జనాలు విచిత్రమైన పరిస్ధితులు చూడబోతున్నారు.
Is bjp taking opposition stand in assembly and council sessions

సోమవారం నుండి జరుగబోయే అసెంబ్లీ సమావేశాల్లో జనాలు విచిత్రమైన పరిస్ధితులు చూడబోతున్నారు. సమావేశాలను ప్రధాన ప్రతిపక్షం వైసిపి బహిష్కరించిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో అసెంబ్లీలో పోయిన సమావేశాలు ఎంత బ్రహ్మాండంగా జరిగాయో అందరూ చూసిందే. కొద్దిరోజులు టిడిపిలోని కొందరు ఎంఎల్ఏలే ప్రతిపక్ష పాత్ర పోషించారనుకోండి అది వేరే సంగతి.

అయితే కేంద్రం పోయిన నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత రాష్ట్రంలో పరిస్ధితులు మారిపోయాయి. దాదాపు నెల రోజులుగా రాజకీయపార్టీల మధ్య బడ్జెట్ మంటలు మండుతున్నాయి. విచిత్రమేమిటంటే అప్పటి వరకూ మిత్రపక్షాలుగా ఉన్న బిజెపి-టిడిపిలే ఒకదానిపై మరోటి కత్తులు దూసుకుంటున్నాయ్. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఏపికి అన్యాయం చేస్తోందంటూ చంద్రబాబునాయుడు యు టర్న్ తీసుకున్నారు. దాంతో బిజెపి కూడా చంద్రబాబుపై మాటల యుద్ధం మొదలుపెట్టి ఉతికి ఆరేస్తోంది. దాంతో రెండు పార్టీలు మిత్రపక్షాలా? లేకపోతే ప్రతిపక్షాలా? అన్నట్లుగా తయారైంది.

ఈ నేపధ్యంలోనే సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్, ప్రత్యేకహోదా, ప్రత్యేకప్యాకేజి, విభజన చట్టం అమలు, రాష్ట్రప్రయోజనాలే ప్రధాన అజెండాగా ఉంటాయనటంలో సందేహం అవసరం లేదు. కాబట్టి ఇన్ని రోజులు కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్న చంద్రబాబు అండ్ కో సమావేశాల్లో కూడా అదే ఒరవడిని కంటిన్యూ చేస్తారు. అప్పుడు బిజెపి ఏం చేస్తుంది?

సభలో పరిస్ధితులను బట్టి తాము నడుచుకోవాలని బిజెపి నిర్ణయించింది. రాష్ట్రప్రయోజనాల విషయంలో చంద్రబాబు, మంత్రులు గనుక కేంద్రంపై తప్పుడు ప్రచారం మొదలుపెడితే తాము కూడా చంద్రబాబు, రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించింది బిజెపి. గడచిన నాలుగేళ్ళుగా చంద్రబాబు అండ్ కో కేంద్రాన్ని ఎలా పొగిడింది.. ప్రధానమంత్రి నరేంద్రమోడి, అరుణ్  జైట్లీలను ప్రశంసిస్తూ మంత్రివర్గంలో చేసిన తీర్మానాలు తదితరాలను ప్రస్తావించబోతోంది. విషయం ఏదైనాగానీ రేపటి నుండి సభలో మిత్రపక్షమే ప్రతిపక్షంగా మారిపోనున్నది.  

Follow Us:
Download App:
  • android
  • ios