మిత్రపక్షం బిజెపీనే చంద్రబాబునాయుడుకు ఎర్త్ పెడతున్నట్లుంది. రివర్స్ వలసలతో చంద్రబాబులో టెన్షన్ మొదలైంది. బిజెపి-టిడిపి మధ్య సంబంధాలు దాదాపు క్షీణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్డీఏలో నుండి చంద్రబాబు బయటకు వచ్చేటం ఒకటే మిగిలింది. వీలైనంత త్వరలో ఆ ముచ్చట కూడా అయిపోతుందని పలువురు బిజెపి నేతలు ఎదురుచూస్తున్నారు. అందుకనే ధైర్యంగా బిజెపి వలసలను ప్రోత్సహిస్తోంది.

ఇంతకాలం మిత్రపక్షం అన్న ఉద్దేశ్యంతో బిజెపి మొహమాటానికి పోయింది. ఎలాగూ రెండు పార్టీల మధ్య వివాదాలు తారస్ధాయికి చేరుకుంది కాబట్టి వలసల విషయంలో మొహమాటం అవసరం లేదని బిజెపి నేతలు నిర్ణయించారు. ఆదివారం జరిగిన కోర్ కమిటి అత్యవసర సమావేశంలో కూడా అదే విధంగా తీర్మానం చేశారు. అందులో భాగమే టిడిపి సీనియర్ నేత అయిన సినీనటి కవితను బిజెపిలోకి తీసుకున్నారు.

త్వరలో కర్నూలు, కడప, ఉభయగోదావరి జిల్లాలపై బిజెపి కన్నేసినట్లు సమాచారం. ఇంతకాలం టిడిపిలో చేరుదామని అనుకున్న నేతలు బిజెపితో టచ్ లో ఉన్నారట. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు రావని అనుమానంగా ఉన్న టిడిపి ఎంఎల్ఏల్లో కొందరు, ఫిరాయింపు ఎంఎల్ఏల్లో ఇంకొందరు బిజెపి నేతలతో మంతనాలు మొదలుపెట్టారట.

నిజానికి టిడిపిలో నేతలెక్కువైపోతే, బిజెపిలో నేతల కొరత చాలా ఉంది. ఇప్పటికిప్పుడు ఒంటరిగా పోటీ చేయాలంటే బిజెపికి 175 మంది ఎంఎల్ఏ అభ్యర్ధులు దొరకటం అనుమానమే. అందుకనే వలసలు కావచ్చు లేదా ఫిరాయింపులు కావచ్చు వీలైనంతగా ప్రోత్సహించాలని బిజెపి జాతీయ నాయకత్వం నుండి ఆదేశాలు వచ్చాయట. వలసలైనా, ఫిరాయింపులైనా ప్రధానంగా టిడిపి నేతలనే బిజెపి లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి త్వరలో టిడిపి నుండి బిజెపిలోకి వలసలు ఏ స్ధాయిలో ఉంటాయో చూడాల్సిందే.