బిజెపిలోని సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వైసిపిలో చేరుతున్నారా? గుంటూరు జిల్లాలోని వైసిపి వర్గాలు అవుననే అంటున్నాయి. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కన్నాతో మంతనాలు జరుపుతున్నారట. అన్నీ సానుకూలమైతే గుంటూరు జిల్లాలోకి జగన్ ప్రవేశించేనాటికి కన్నా పార్టీలో చేరికపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాల సమాచారం.

గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నుండి నాలుగు సార్లు గెలిచారు. తర్వాత గుంటూరు వెస్ట్ నుండి ఒకసారి గెలిచినా రెండోసారి ఓడిపోయారు. రాష్ట్ర విభజన వల్ల దెబ్బతిన్న అనేకమంది సీనియర్ నేతల్లో కన్నా కూడా ఒకరు. 2014 ఎన్నికల తర్వాత కన్నా మెల్లిగా బిజెపిలో చేరారు. అయితే, పెద్దగా ఉపయోగం కనబడలేదు. ఎందుకంటే, రాష్ట్రంలో బిజెపికంటూ పెద్దగా బలమేమీ లేదు. నేతల బలమే పార్టీ బలమన్న విషయం అందరికీ తెలిసిందే.

కేంద్ర  మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నాకు రాజకీయ గురువుగా ప్రచారంలో ఉంది. అయితే, బిజెపిలో కావూరికే దిక్కులేదు. దాంతో కన్నాకు కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో కొంత కాలంగా మదనపడుతున్నారట. ఎందుకంటే, త్వరలో ఎన్నికలు వస్తుండటమే కారణం. బిజెపిలో ఉంటే లాభం లేదని మద్దతుదారులు కూడా పోరుతున్నారట. అలాగని టిడిపిలోకి వెళ్ళలేరు.

అందుకని ఇక, వైసిపి ఒకటే దారి. దాంతో కన్నా కూడా అదే పద్దతిలో ఆలోచిస్తున్నారట. అందులోనూ వైసిపికి కూడా గుంటూరు జిల్లాలో సీనియర్ నేతల అవసరం ఎటూ అవసరమే. దాంతో అటు జగన్ ఇటు కన్నాకు కావాల్సిన కాపు నేతలు కొందరు మధ్యవర్తిత్వం నెరుపుతున్నారట. పార్టీలోకి కన్నాను తీసుకోవటానికి జగన్ కూడా సుముఖంగానే ఉన్నారట.

కన్నా గతంలో పోటీ చేసిన పెదకూరపాడైనా ఓకే లేకపోతే గుంటూరు వెస్ట్ అయినా పర్వాలేదని జగన్ ఓకే చెప్పారట. అయితే, కన్నా ఏమో రెండు టిక్కెట్లు అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు జగన్ అంగీకరిస్తారా అన్నదే సందిగ్దంలో ఉంది. మరి ఏమవుతుందో చూడాలి?