ఓవైపు రాష్ట్రంలో కరువు, పంటలకు గిట్టుబాటు ధరలు రావటం లేదని రైతులు అల్లాడిపోతుంటే తీరిగ్గా సినిమాకు అభినందనలు తెలుపుతూ మంత్రివర్గం తీర్మినం చేయటమేంటో?
బాహుబలి సినిమా మానియా చంద్రబాబునాయుడును పూర్తిగా కమ్మేసినట్లే ఉంది. లేకపోతే ఓ సినిమా గురించి ఏకంగా మంత్రివర్గంలో చర్చించటమేంటి? అభినందనలు తెలుపుతూ తీర్మానం చేయటమేంటి విచిత్రం కాకపోతే. ఒక సినిమా నిర్మాణ యూనిట్ కు మంత్రివర్గంలో అభినందన తెలుపుతూ తీర్మానం చెప్పటమా? గతంలో ఎన్నడూ ఈ విధంగా ఉన్నట్లు లేదు. బాహుబలి-2 సినిమా బ్రహ్మాండంగా ఉందంటూ చంద్రబాబు ఒకటే ఊదరగొట్టటం విచిత్రంగా ఉంది.
చూడబోతే సినిమాకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడరా అని అనుమానం వచ్చేట్లుంది. సినిమాను అద్యంతం హృద్యంగా మలచిన రాజమౌళికి హ్యాట్సాఫ్ చెబుతూ మంత్రివర్గం తీర్మానించటం అవసరమా? ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి తెలుగువారి చిత్ర నిర్మాణ ప్రతిభా పాటవాన్ని చాటిచెప్పిన బాహుబలి సినిమాను ఆస్కార్కు సిఫారసు చేయాల్సిందిగా కేంద్రప్రభుత్వాన్ని కోరుతానంటూ చంద్రబాబునాయుడు మీడియాతో చెప్పటం గమనార్హం.
పైగా బాహుబలి సినిమాను చూసినవెంటనే రాజమౌళి, రాణాకు ఫోన్ చేసి అభినందించానని, ప్రభాస్ విదేశాల్లో ఉన్నందున అందుబాటులోకి రాలేదని చెప్పటం విశేషం. సినిమా యూనిట్ ను త్వరలో అమరావతికి తీసుకొచ్చి సన్మానిస్తామని కూడా చెప్పారు. బాహుబలి అనేది ఓ కమర్షియల్ ఫార్ములా సినిమా. దానిపై ఇప్పటికే రెండు రకాల విమర్శలూ వినబడుతున్నాయి.
సినిమాలో సామాజిక సమస్యలకు సంబంధించిన ఒక్క అంశం కూడా లేదన్నది వాస్తవం. పూర్తిగా కల్పిత కథ. అటువంటి కమర్షియల్ సినిమా నిర్మాతలకు డబ్బు చేసుకోవటానికి వీలైనన్ని అవకాశాలను ఇప్పటికే ప్రభుత్వం కల్పించింది అదనపు షోలు వేసుకోవటం, టిక్కెట్ల ధరలు పెంచుకోవటం ద్వారా.
పోనీ నిర్మాతలేమైనా ప్రభుత్వానికి ఓ వంద కోట్ల రూపాయలేమన్నా విరాళంగా ఇచ్చారా అంటే అదీ లేదు. సినిమాలో సహజత్వం తక్కువ, గ్రాఫిక్స్ ఎక్కువ. పైగా సినిమా సన్నివేశాల్లో ఎక్కవ భాగం విదేశాలకు చెందిన ఏదో ఒక సినిమా నుండి కొట్టిన కాపీనే అన్న ఆరోపణలు వినబడుతూనే ఉన్నాయి. ఓవైపు రాష్ట్రంలో కరువు, పంటలకు గిట్టుబాటు ధరలు రావటం లేదని రైతులు అల్లాడిపోతుంటే తీరిగ్గా సినిమాకు అభినందనలు తెలుపుతూ మంత్రివర్గం తీర్మినం చేయటమేంటో?
