అరకు వైసీపీ పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత సేఫేనా? గీత ఎస్టీ కాదంటూ టిడిపి నేత గుమ్మడిసంధ్యారాణి గతంలో వేసిన కేసును ఉపసంహరించుకోవటంతో అందరిలోనూ ఇదే ప్రశ్న తెలెత్తుతోంది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున విజయనగరం జిల్లా అరకు ఎంపి స్ధానం నుండి కొత్తపల్లి గీత పోటీ చేసారు. టిడిపి అభ్యర్ధిగా గుమ్మడి సంధ్యారాణి పోటీ పడ్డారు. అయితే, కొత్తపల్లి గెలిచారు. వెంటనే సంధ్యారాణి గీత ఎస్టీ కాదని ఆరోపించారు. తప్పుడు కుల ధృవపత్రాలు చూపించి పోటీ చేసారంటూ తీవ్రంగా ఆరోపించారు. ఆమె ఆరోపణలకు టిడిపి మద్దతుగా నిలిచింది.

చంద్రబాబు మద్దతుగా నిలవటంతో సంధ్యారాణి హైకోర్టులో పెద్ద పోరాటమే చేసారు. తన వాదనకు తగ్గట్లుగా ఈధారాలను కూడా కోర్టుకు సమర్పించారు. అయితే, ఎన్నికల తర్వాత కొత్తపల్లి టిడిపికి దగ్గరయ్యారు. ప్రస్తుతం కొత్తపల్లి సాంకేతికంగా వైసీపీ ఎంపినే అయినప్పటికీ అంటకాగుతున్నది మాత్రం టిడిపితోనే. దాంతో సంధ్యారాణికి సమస్యలు మొదలయ్యాయి. కొత్తపల్లిపై కేసు వేయమని ప్రోత్సహించిన నేతలు ఇపుడు సంధ్యారాణిని పట్టించుకోవటం లేదు. ఇంతలో కోర్టులో కేసు తుదిదశకు వచ్చింది. రేపో మాపో కేసులో తీర్పు వస్తుందని అందరూ అనుకుంటున్నారు.

ఇటువంటి సమయంలో హటాత్తుగా సంధ్యారాణి కోర్టులో కేసును ఉపసంహరించుకున్నారు. దాంతో అప్పటి వరకూ సంధ్యారాణికి కేసు విషయంలో అండగా నిలిచిన కుల సంఘాలన్నీ నివ్వెరపోయాయి. తన కేసులో తీర్పు వస్తే ఎంపిగా తాను రాజీనామా చేయాల్సి వస్తుందని కొత్తపల్లి  టిడిపి అధిష్టానంపై ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అధిష్టానం ఆదేశాలతోనే సంధ్యకూడా కేసు ఉపసంహరించుకున్నట్లు సమాచారం. ఇదే విషయమై సంధ్యారాణి మాట్లాడుతూ, కేసు ఉపసంహరించుకున్నది వాస్తవమేనని అంగీకరించారు. అయితే, అందుకు కారణాలు మాత్రం చెప్పటం లేదు.

సరే, సంధ్యారాణి కేసు ఉపసంహరించుకున్నారు. అందుకు ఆమె కారణాలు ఆమెకు ఉండవచ్చు. అయితే, సంధ్యారాణి కేసు ఉపసంహరించున్నంత మాత్రాన ఇపుడు కొత్తపల్లి ఎస్టీ అయిపోతారా? సంధ్యారాణిపై ఒత్తిడి తెచ్చే కేసు ఉపసంహరించుకునేట్లు చేసారంటేనే కొత్తపల్లిలో ఆందోళన స్పష్టమవుతోంది కదా? మరి, చూడాలి కోర్టు తీర్పు చెబుతుందో?