Asianet News TeluguAsianet News Telugu

ఏపికి అప్పులు పుట్టటం లేదా?

ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఏపికి అప్పులు పుట్టటం లేదా?

Is ap government could not get loans for development projects

ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఏపికి అప్పులు పుట్టటం లేదా? చంద్రబాబునాయుడు తాజాగా కేంద్రానికి రాసిన లేఖను చూస్తే ఆమాట నిజమే అనిపిస్తోంది. రాష్ట్రలో ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే డబ్బు కావాలి. ప్రభుత్వ ఖజానా ఒట్టిపోయింది. దాంతో అప్పుల కోసం  ఆర్ధిక సంస్ధల చుట్టూ తిరిగింది. అయితే, ఎవరూ అప్పులు ఇచ్చినట్లు లేదు.

అందుకని చంద్రబాబు తాజాగా కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ఓ లేఖ రాసారు. ప్రాజెక్టులు చేపట్టేందుకు విదేశీ రుణ సహాయాలను నమ్ముకుంటే పుణ్యకాలం గడిచిపోతోందని వాపోయారు. ప్రభుత్వం మొదలుపెట్టదలచుకున్న 6 ప్రాజెక్టులకు భారీగా నిధులు కావాలంటూ చెప్పారు. విదేశీ సంస్ధలనుండి ఏపికి అప్పులు పుట్టాలన్నా కేంద్రం హామీ ఇవ్వాల్సి ఉంటుంది.

కాబట్టి కేంద్రం హామీనిచ్చి బయట సంస్ధలనుండి అప్పులు ఇప్పించేబదులు నాబార్డ్ లాంటి సంస్ధల నుండే గ్రాంట్ ఇప్పించాలంటూ చంద్రబాబు కోరటం గమనార్హం. అప్పులంటే తిరిగి చెల్లించాల్సిందే. అదే గ్రాంట్ అంటే చెల్లించాల్సిన అవసరం లేదు. అందుకే చంద్రబాబు గ్రాంట్ ఇప్పించమంటున్నారు. చంద్రబాబు లెక్కప్రకారం 6 ప్రాజెక్టులను చేపట్టాలంటే రూ. 16,725 కోట్లు అవసరం.

స్ధానికంగా అప్పులు పుట్టకపోవటం వల్లే చంద్రబాబు విదేశీ సంస్ధల నుండి అప్పు కోసం ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతోంది. అప్పు కోసం ప్రభుత్వం దరఖాస్తు చేయగానే ఏ సంస్ధ కూడా ఇచ్చేయదుకదా? అప్పు తీసుకున్న ప్రభుత్వానికి తిరిగి తీర్చే స్ధాయి, వడ్డీలు కట్టే స్తోమత, ఆర్ధిక వనరుల నిర్వహణ, ఆదాయ, వ్యయాలు ఇలా..చాలా అంశాలనే క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ఆ పరిశీలనలో ఏపి ప్రభుత్వ పరిస్ధితి ఆశించిన స్ధాయిలో లేదని బహుశా విదేశీ ఆర్ధిక సంస్ధలకు అనిపించిందేమో? అందుకనే అప్పులు ఇవ్వటంలో బాగా జాప్యం చేస్తున్నాయి.

ఒకవైపేమో 2019 ఎన్నికలు ముంచుకు వచ్చేస్తున్నాయి. మూడున్నరేళ్ళల్లో చెప్పుకోతగ్గ ప్రాజెక్టు ఒక్కటి చేపట్టలేదు. దాంతో చంద్రబాబుపై ఒత్తిడి పెరిగిపోతోంది. దాంతో మొదటికే మోసం వస్తోందని గ్రహించినట్లున్నారు. చంద్రబాబు లెక్కల ప్రకారం ఏపి గ్రామీణ నీటి సరఫరా ప్రాజెక్టుకు రూ. 4500 కోట్లు, మండల, గ్రామీణ అనుసంధాన మెరుగుదల ప్రాజెక్టుకు రూ. 3200 కోట్లు, ఆశ్రమ పాఠశాలల భవనాల నిర్మాణం కోసం రూ. 3341 కోట్లు, రోడ్లు, వంతెనల పునర్నినిర్మాణ ప్రాజెక్టుకు రూ. 3200 కోట్లు, అమరావతి హరితాభివృద్ధి ప్రాజెక్టుకు రూ. 1484 కోట్లు, వెనుకబడిన ప్రాంతాల గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టుకు ర.. వెయ్యి కోట్లు అవసరం.

Follow Us:
Download App:
  • android
  • ios