కర్నూలు జిల్లా పత్తికొండలో వచ్చే ఎన్నికల్లో ఎదురుండదా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అదే నిజమనిపిస్తోంది. పోయిన ఏడాది వరకూ వైసిపి తరపున చెఱుకులపాడు నారాయణరెడ్డి నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్నారు. ద్వితీయ శ్రేణినేతల్లోను, కార్యకర్తల్లోనూ నారాయణరెడ్డికి అపారమైన పట్టుంది. దానికితోడు ఉపముఖ్యమంత్రి, రెవిన్యూమంత్రి కెఇ కృష్ణమూర్తిపై విపరీతమైన వ్యతిరేకత మొదలైపోయింది. ప్రభుత్వం మీద వ్యతిరేకత దానికి అదనంగా తోడైంది.

ఇటువంటి నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో కెఇ కృష్ణమూర్తి కొడుకు కెఇ శ్యాంబాబు ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ స్వయంగా కెఇనే చెప్పారు. దాదాపు 80లకు దగ్గరలో ఉన్నకృష్ణమూర్తి రాజకీయాల నుండి పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకనే కొడుకును తెరపైకి ప్రత్యక్షంగా తీసుకువచ్చారు. అప్పటి నుండి కెఇ శ్యాంబాబు-చెఱుకులపాడు మధ్య సమస్యలు మొదలయ్యాయి.

ఇద్దరికీ ఫ్యాక్షన్ నేపధ్యముండటంతో గొడవలకు హద్దులేకపోయింది. అయితే టిడిపి అధికారంలో ఉండటంతో కెఇ కుటుంబానికి ఎదురులేకపోయింది. అదే అవకాశంగా తీసుకుని పోయిన ఏడాది ప్రత్యర్ధులు చెఱుకులపాడును దారుణంగా హత్యచేశారు. హత్య వెనుక శ్యాంబాబే ప్రధాన సూత్రదారంటూ చెఱుకులపాడు భార్య శ్రీదేవిరెడ్డి ఎంత మొత్తుకున్న పోలీసులు పట్టించుకోలేదు. ఏదో తూతూమంత్రంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామంటూ చెబుతున్నారు.

పోలీసులను నమ్ముకుంటే లాభం లేదన్న ఉద్దేశ్యంతో శ్రీదేవిరెడ్డి కోర్టులో పిటీషన్ వేశారు. ఆ కేసు విచారించిన న్యాయమూర్తి గతంలోనే కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్ఐకి బాగా అక్షింతలేశారు. అయినా పోలీసుల్లో మార్పు రాలేదు. దాంతో శుక్రవారం కేసు విచారణకు వచ్చిన నేపధ్యంలో ఎస్ఐ, కెఇ శ్యాంబాబుతో పాటు టిడిపికి చెందిన జడ్పిటిసి కప్పట్రాళ్ళ బొజ్జమ్మను వెంటనే అరెస్టు చేయాలంటూ ఆదేశాలిచ్చింది. దాంతో టిడిపికి, కెఇ కుటుంబానికి పెద్ద షాక్ కొట్టినట్లైంది.

అసలే, నారాయణరెడ్డి మృతితాలూకు సానుభూతి వైసిపికి బాగా కలిసి వస్తుందని అందరూ అనుకుంటున్నారు. అందులోనూ శ్రీదేవిరెడ్డి నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. ఇటువంటి నేపధ్యంలో రేపటి ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా పోటీ చేయబోయే కెఇ శ్యాంబాబు అరెస్టు తప్పదని తేలటంతో వైసిపికి ఎదురులేదన్న ప్రచారం ఊపందుకున్నది. ఇప్పటికిప్పుడు శ్యాంబాబుకు ప్రత్యామ్నాయంగా అభ్యర్ధిని తయారు చేసుకోవటం టిడిపికి కష్టమే.