ఉక్కుపాదం మోపటమన్నది పాలకులకు ఊతపదం అయిపోయినట్లుంది.

వెనకటికి ఒకడు ‘లేస్తే మనిషిని కాన’న్నాడట. అలాగే ఉంది చంద్రబాబు వ్యవహారం. బుధవారం జరిగిన టెలికాన్ఫరెన్స్ లో ర్యాగింగ్ పై మాట్లాడారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, కళాశాలల ప్రిన్సిపాళ్ళు తదితరులతో మాట్లాడుతూ, ర్యాగింగ్ పై ఉక్కుపాదం మొపాలన్నారు. ఇలా ఎన్నిసార్లు ఉక్కుపాదాలు మోపుతారో ఏంటో అర్ధం కావటం లేదు.

 ఉక్కుపాదం మోపటమన్నది పాలకులకు ఊతపదం అయిపోయినట్లుంది. విద్యాసంస్ధలు చదువుకునే దేవాలయాలుగా ఉండాలని ఒక హితవు కూడా పలికారు. ఎలాగుంటుంది. ర్యాగింగ్ జరుగుతున్నది, ఆత్మహత్యలు జరుగుతున్నది ఎక్కువగా కార్పొరేట్ కళాశాలల్లోనే అన్న విషయం చంద్రబాబుకు తెలియదా? కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక ఒకటి మళ్ళీ.

ర్యాగింగ్ జరుగుతున్న కళాశాలలు, ఆత్మహత్యలు జరుగుతున్న కళాశాలల యాజమాన్యాలపై ఇంత వరకూ ఒక్క చర్య అయినా సిఎం తీసుకున్నారా? మంత్రివర్గంలోనే కార్పొరేట్ కళాశాల యాజమానిని పెట్టుకుని వాటిపై చర్యలు తీసుకునే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని జనాలు ప్రశ్నిస్తున్నారు. పైగా సదరు మంత్రికి మరో మంత్రి స్వయానా వియ్యంకుడు. అందులోనూ విద్యశాఖకే. ఇక చెప్పేదేముంది.

దానికి కొసరుగా అన్నట్లు వారిద్దరూ కాపు సామాజిక వర్గంలో బలమైన వ్యక్తులు కూడా. ఇన్ని భుజకీర్తులున్నపుడు వారిపై చంద్రబాబు ఏమని చర్యలు తీసుకోగలరు. అందుకనే వారి కళాశాలలో జరిగిన ఏ ఒక్క ఆత్మహత్య, ర్యాగింగ్ ఘటనలపై ఇంత వరకూ ఒక్క చర్య కూడా తీసుకోలేదు. మరి, ఈ హూంకరింపులు, ఉక్కుపాదాలు మోపటం ఎవరిని బెదిరించటానికి?