ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ వైసిపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా బదిలీల్లో కీలకమైన ఏసిబి డిఐజీ పదవి పి.హెచ్.డి.రామకృష్ణకు దక్కింది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ఇటీవల జిల్లాల పునర్విభజన తర్వాత భారీగా ఐఎఎస్, ఐపిఎస్ ల స్థానచలనం జరిగిన విషయం తెలిసిందే. ఇలా జరిగి నెలరోజులు గడవగానే మరోసారి ఐఎఎస్ ల బదిలీలు జరగ్గా తాజాగా ఐపిఎస్ ల బదిలీ కూడా చేపట్టింది జగన్ సర్కార్. ఐపిఎస్ ల బదిలీకి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా బదిలీల్లో కీలకమైన ఏసిబి డిఐజీ పదవి పి.హెచ్.డి.రామకృష్ణకు దక్కింది. ఆయనకే , టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా అదనపు బాద్యతలను అప్పగించారు. ఇక డీఐజీ శాంతిభద్రతలుగా ఎస్వీ రాజశేఖర్ బాబు కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయనకే ఆక్టోపస్ డీఐజీగా బాధ్యతలు కూడా అప్పగించారు.
ఐజీపీ క్రీడలు, సంక్షేమంతో పాటు రైల్వే ఏడీజీగానూ ఎల్ కేవీ రంగారావు అదనపు బాద్యతలు కేటాయించారు. పోలీసు శిక్షణ వ్యవహారాల డీఐజీగా కేవీ మోహన్ రావు బదిలీ అయ్యారు. కోస్టల్ సెక్యూరిటీ డీఐజీగా ఎస్.హరికృష్ణకు అదనపు బాద్యతలు అప్పగించారు.
గోపీనాథ్ జెట్టికి గ్రేహౌండ్స్ డీఐజీగా, న్యాయవ్యవహారాల ఐజీపీగా అదనపు బాధ్యతలు, కోయ ప్రవీణ్ ను 16 బెటాలియన్ కమాండెంట్ గా బాధ్యతలు అప్పగించారు. విశాల్ గున్నీకి విజయవాడ రైల్వే ఎస్పీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. డి.ఉదయబాస్కర్ ను పోలీసు హెడ్ క్వార్టర్లకు రిపోర్టు చేయాలని ఆదేశించారు.
కాకినాడ జిల్లా ఎస్పీగా ఉన్న రవీంద్రనాథ్ బాబుకు ఏపీఎస్పీ 3 బెటాలియన్ కమాండెంట్ గానూ అదనపు బాధ్యతలు అప్పగించారు. అజితా వేజేండ్ల గుంతకల్ రైల్వే ఎస్పీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పి. అనిల్ బాబు ను పోలీసు హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేసారు.
జి.కృష్ణకాంత్ రంపచోడవరం అదనపు ఎస్పీ ఆపరేషన్స్ గా బదిలీ చేసారు. పి.జగదీశ్ ను చిత్తూరు జిల్లా అదనపు అడ్మిన్ ఎస్పీగా బదిలీ చేసారు. డి.ఎన్ .మహేష్ ను పోలీసు హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేసారు. తుహిన్ సిన్హాను పాడేరు అదనపు ఎస్పీ అడ్మిన్ గా నియమించారు.
బిందుబాధవ్ గరికపాటిని పలనాడు జిల్లా అదనపు అడ్మిన్ ఎస్పీగా బదిలీ చేసారు. పీవీ రవికుమార్ ను విజిలెన్సు , ఎన్ ఫోర్సుమెంట్ ఎస్పీగా బదిలీ చేసారు. ఇలా చాలామంది ఐపిఎస్ ల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం వెంటనే నూతన పోస్టింగ్స్ అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదిలావుంటే ఇటీవల పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా ఉన్న కేఎస్ జవహర్ రెడ్డిని ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి బదిలీ చేసింది. జవహర్ రెడ్డి టీటీడీ ఈవోగా, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. అయితే టీటీడీ ఈవోగా తప్పించడంతో ఆయన ఇప్పుడు పూర్తి స్థాయిలో సీఎంవో ముఖ్య కార్యదర్శిగా కొనసాగనున్నారు. ఇక టీటీడీ ఈవో పోస్టు నుంచి జవహర్ రెడ్డి బదిలీ కావడంతో.. ధర్మారెడ్డికి అదనపు బాధ్యతలను అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ధర్మారెడ్డి ఈ బాధ్యతల్లో కొనసాగనున్నట్టుగా తెలిపింది.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఎండీగా సత్యనారాయణకు, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఇంతియాజ్‌కు బాధ్యతలను అప్పగించింది. యవజన సర్వీసుల శాఖ కమిషనర్‌గా శారదా దేవీని ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.
