ఐపిఎల్ లో సిఎస్కే తరఫున ఆడుతున్న క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్నారు. ఆయన వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నట్లు అర్థమవుతోంది.
అమరావతి: తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు తాను ఏ పార్టీలో చేరబోయేది సంకేతాలు ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లు ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ఆయనను తమ పార్టీలోకి తేవడానికి బిఆర్ఎస్ నేత తోట చంద్రశేఖర్ ప్రయత్నించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. అయితే, ఆయనను దాంతో సంబంధం లేకుండా తెలుగు ప్రజలంతా అభిమానిస్తారు.
రంజీలో అంబటి రాయుడు హైదరాబాద్ తరఫున ఆడారు. అయితే. తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రమే ఉంటానని చెప్పారు. దాంతో ఆయన పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదనే వార్తలు వచ్చాయి. అంబటి రాయుడు చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నట్లు ఓ పత్రిక రాసింది. అయితే, తాజాగా మరో ప్రచారం ముందుకు వచ్చింది. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు అర్థమవుతుంది. అలా అర్థం కావడానికి అంబటి రాయుడే అవకాశం కల్పించారు. వైఎస్ జగన్ ను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు.
ఏపి రాజకీయాల్లోకి అంబటి రాయుడు: గాలం వేస్తున్న బిఆర్ఎస్
శ్రీకాకుళం జిల్లా ప్రగతికి అత్యంత ప్రధానమైన మూలపేట పోర్టుకు వైఎస్ జగన్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిరారు. జగన్ ప్రసంగాన్ని వైసిపి ట్విట్టర్ లో పోస్టు చేసింది. దాన్ని అంబటి రాయుడు రీట్వీట్ చేశారు. అలా ట్వీట్ చేస్తూ తన వ్యాఖ్యను కూడా జోడించారు. "మన సిఎం వైఎస్ జగన్ ప్రసంగం అత్యద్భుతం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ నమ్మేది, విశ్వసించేది మిమ్మల్నే సర్" అంటూ ఆయన ప్రశంసించారు. దాంతో అంబటి రాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడం ద్వారా తన పొలిటిక్ ఇన్నింగ్సును ప్రారంభిస్తారనే ప్రచారం జరుగుతోంది.
అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందినవారు. దీంతో గుంటూరు జిల్లాలోని ఏదో ఒక నియోజకర్గం నుంచి పోటీ చేయాలని ఆయన అనుకున్నట్లు తెలుస్తోంది. తనకు అనుకూలమైన నియోజకర్గాన్ని వెతికి పెట్టాలని రాయుడు తన మిత్రులను అడిగినట్లు సమాచారం.
