ప్రముఖ తెలుగు క్రికెటర్, సిఎస్కే ఆటగాడు అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు. అయితే, ఏ పార్టీలో చేరేది ఆయన నిర్ణయం తీసుకోలేదు. జనసేనలో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు.
హైదరాబాద్: తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారా? అవుననే సమాధానం వస్తోంది. అంబటి రాయుడు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల దినపత్రిక రాసింది. తన రాజకీయ రంగ ప్రవేశంపై అంబటి రాయుడు సానుకూలంగా ప్రతిస్పందించినట్లు కూడా రాసింది. అంబటి రాయుడు ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపిఎల్ లో ఆడుతున్నాడు.
ఈ ఐపిఎల్ సీజన్ ముగిసిన తర్వాత తాను రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నట్లు అంబటి రాయుడు సిఎస్కే యాజమాన్యానికి చెప్పనున్నట్లు సమాచారం. తాను రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్నట్లు, ప్రజలకు సేవ చేయడానికి అదే ఉత్తమ మార్గమని భావిస్తున్నట్లు అంబటి రాయుడు తమతో చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు తాను ప్రజలను కలుస్తానని, ఏ పార్టీలో చేరాలనేది అప్పుడే నిర్ణయం తీసుకుంటానని అన్నట్లు కూడా టైమ్స్ ఇండియా రాసింది.
రాయుడు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందినవారు. ఆయన తన రంజీ క్రికెట్ కెరీర్ ను హైదరాబాద్ నుంచే ప్రారంభించారు. అందువల్ల హైదరాబాద్ లో ఎక్కడినుంచైనా పోటీ చేస్తారా అని అడిగితే లేదని, తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటానని చెప్పినట్లు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.
ఇదిలావుంటే, బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు గుంటూరు జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తనకు సరిపోయే నియోజకవర్గాన్ని సూచించాల్సింది తన అభిమానులను, శ్రేయోభిలాషులను అంబటి రాయుడు కోరినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.
తమ పార్టీలోకి రావాలని బిఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అంబటి రాయుడిని కోరినట్లు తెలుస్తోంది. చంద్రశేఖర్ అంబటి రాయుడి మిత్రుడితో ఆ విషయాన్ని ప్రస్తావించి అందుకు ఒప్పించాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే, తనను ఎవరూ సంప్రదించలేదని, ప్రజలతో సమావేశమైన తర్వాతనే తాను నిర్ణయం తీసుకుంటానని అంబటి రాయుడు టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పారు. అంబటి రాయుడు పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.38 ఏళ్ల వయస్సు గల అంబటి రాయుడు ఈ ఐపిఎల్ సీజన్ తర్వాత పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకుని రాజకీయాల్లోకి వస్తారని అంటున్నారు.
