సారాంశం

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు అధికారిని మారుస్తూ ఏపీ సీఐడీ నిర్ణయం తీసుకుంది.

విజయవాడ: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు అధికారిని మారుస్తూ ఏపీ సీఐడీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దర్యాప్తు అధికారిగా ఉన్న ఏఏస్పీ  జయరాజు స్థానంలో డీఎస్పీ విజయ భాస్కర్‌లు బాధ్యతలు అప్పగించింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు దర్యాప్తు అధికారి మార్పుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. జయరాజుకు పని భారం ఎక్కువుగా ఉండటంతో దర్యాప్తు అధికారిని మార్పు చేసినట్లు సీఐడీ పిటీషన్‌లో పేర్కొంది. 

ఇదిలా ఉంటే, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నారా లోకేష్‌ను అధికారులు విచారించనున్నారు. మధ్యలో గంట సేపు భోజనం కోసం విరామం ప్రకటించారు. ఈ కేసులో నారా లోకేష్‌ను ఏపీ సీఐడీ.. ఏ14గా పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఇక, ఇదే కేసులో మరో ఐదుగురిని నిందితులుగా చేర్చుతూ సీఐడీ అధికారులు.. విజయవాడలోని  ఏసీబీ  కోర్టులో సోమవారం మెమో దాఖలు చేశారు. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి‌తో పాటు రాపూరి సాంబశివరావు, పొత్తూరి ప్రమీల, ఆవుల మునిశేఖర్, కొత్తాపు వరుణ్‌కుమార్‌లను ఈ కేసులో నిందితులగా పేర్కొన్నారు.