దినసరి కూలీలు అయినప్పటికి ఒక్కగానొక్క కూతురిని ఎంతో ప్రేమగా చూసుకునేవారు ఆ తల్లిదండ్రులు. కానీ ఆ కూతురు మాత్రం పేరెంట్స్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా కేవలం స్నాక్స్ కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

విశాఖపట్నం : పుట్టినరోజు జరుపుకుని 24 గంటలు గడవకముందే ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. తల్లి తనకు ఇష్టమైన స్నాక్స్ తీసుకురాలేదన్న చిన్న కారణానికే యువతి ప్రాణాలు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇంటిపైకి ఎక్కి కిందకు దూకడంతో యువతి తలకు బలమైన గాయమై అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం కొమ్మాదిలోని గురుకుల్ రెసిడెన్షియల్ కాలేజీలో ఓ యువతి ఇంటర్మీడియట్ బైపిసి చదువుతోంది. మంగళవారం ఆమె పుట్టినరోజు వుండటంతో తల్లిదండ్రులతో కలిసి జరుపుకునేందుకు ఇంటికి వెళ్ళింది. ఇలా ఎంవిపి కాలనీలోని ఇంట్లోనే భర్త్ డే జరుపుకున్న యువతి బుధవారం తిరిగి హాస్టల్ కు వెళ్లేందుకు సిద్దమయ్యింది. అంతలోనే దారుణం జరిగింది. 

కూతురు హాస్టల్లో తినడానికి కొన్ని చిరుతిళ్లను ఆ తల్లి ఎంతో ప్రేమతో తీసుకువచ్చింది. కానీ తల్లి తనకు ఎంతో ఇష్టమైన స్నాక్స్ తీసుకురాలేదని యువతి అలిగింది. ఈ క్రమంలో తల్లితో వాగ్వాదానికి దిగిన యువతి క్షణికావేశంలో ప్రాణాలమీదకు తెచ్చుకుంది. 

Read More విశాఖలో సైకో భర్త కిరాతకం... భార్యను జుట్టుపట్టుకుని రోడ్డుకీడ్చి బ్లేడ్ తో దాడి

కోపంగా ఇంటిపైకి ఎక్కిన యువతి కిందకు దూకేసింది. దీంతో ఆమె తల పగిలి తీవ్ర గాయమైంది. వెంటనే తల్లిదండ్రులు నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు కూతురిని తరలించారు. ప్రస్తుతం యువతి అపస్మారక స్థితిలోనే వుందని... మరికొంత సమయం గడిస్తేగాని ఆమె పరిస్థితి గురించి చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. ఇలా చిన్న విషయానికే ప్రాణాలమీదకు తెచ్చుకుని తల్లిదండ్రులను ఏడిపిస్తోంది యువతి. 

రోజువారి కూలీ చేసుకునే నిరుపేదలైన ఆ తల్లిదండ్రులు తమలాగే కూతురు కష్టాలు పడకూడదని బాగా చదివిస్తున్నారు. వారికి స్తోమతకు మించి ఒక్కగానొక్క కూతురికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు. కానీ ఆ యువతి మాత్రం తల్లిదండ్రుల కష్టాన్ని ఏమాత్రం గుర్తించకుండా కేవలం స్నాక్స్ కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమె వైద్యఖర్చులు ఆ పేద పేరెంట్స్ కు భారం కానున్నాయి. అయినా తమ బిడ్డ బ్రతికితే చాలని భావిస్తున్న తల్లిదండ్రులు మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నారు. 

(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)