ఓ సైకో భర్త కట్టుకున్న భార్యను జుట్టుపట్టుకుని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి అందరూ చూస్తుండగానే బ్లేడ్ తో విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.
విశాఖపట్నం : భార్యపై అనుమానంతో ఓ భర్త అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు. భార్యను జుట్టుపట్టుకుని రోడ్డుపైకి లాక్కువచ్చి అందరూ చూస్తుండగానే బ్లేడ్ తో ముఖం, మెడపై విచక్షణారహితంగా దాడిచేసాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో ఆమె రోడ్డుపైనే పడిపోగా అలాగే వదిలేసి వెళ్లిపోయాడు. ఇలా సైకో భర్త చేతిలో భార్య నడిరోడ్డుపైనే చిత్రహింసలకు గురయిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నంలోని పూర్ణ మార్కెట్ ప్రాంతంలో ప్రసాద్, నీలిమ దంపతులు నివాసముండేవారు. ప్రసాద్ తల్లి ముత్యాలమ్మ కూడా ఇదే ఇంట్లో వుండేది. అయితే భర్తతో మనస్పర్ధల కారణంగా ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయిన నీలిమ అరిలోవ ప్రాంతంలో ఒంటరిగా నివాసం వుంటోంది. ఇలా దూరంగా వున్నప్పటికి నీలిమపై భర్త, అత్త వేధింపులు కొనసాగాయి. తరుచూ ఆమెవద్దకు వచ్చి గొడవపడుతూ వుండేవారు.
తాజాగా భర్త ప్రసాద్, అత్త ముత్యాలమ్మ ఒంటరిగా వుంటున్న నీలిమ వద్దకు వచ్చి విచక్షణారహితంగా దాడికి దిగారు. భార్యను జుట్టుపట్టుకుని ఇంట్లోంచి బయటకు లాక్కువచ్చిన ప్రసాద్ నడిరోడ్డుపైనే దాడికి దిగాడు. వెంటతెచ్చుకున్న బ్లేడ్ తో భార్య ముఖం, మెడతో పాటు శరీరంపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. ఇలా కోడలిపై దాడిచేస్తున్న కొడుకుకు ముత్యాలమ్మ సహకరించింది.
భర్త బ్లేడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన నీలిమను స్థానికులు హాస్పిటల్ తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త ప్రసాద్, అత్త ముత్యాలమ్మపై హత్యాయత్నం చేసు నమోదు చేసారు పోలీసులు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు అరిలోవ సీఐ సోమశేఖర్ తెలిపారు.
ప్రస్తుతం నీలిమ హాస్పిటల్లో చికిత్ప పొందుతోంది. ఆమె ప్రాణాలకు ప్రమాదమేమీ లేదని... పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు సమాచారం. ముఖం, మెడపై బ్లేడ్ గాట్లు నయం కావడానికి సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.
