విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ యువనేత, హీరో బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కు ఆంధ్రాబ్యాంక్ షాకిచ్చింది. ఆంధ్రాబ్యాంక్ కు శ్రీభరత్ సుమారు 13లక్షలకు పైగా బకాయి పడటంతో ఆస్తుల వేలానికి ఆంధ్రాబ్యాంక్ నోటీసులు జారీ చేసింది. 

వివరాల్లోకి వెళ్తే మెస్సర్ వి.బి.సి రెన్యువేబిల్ ఎనర్జీ సంస్థ నిర్మాణం కోసం శ్రీభరత్ తనకు చెందిన ఆస్తులను ఆంధ్రాబ్యాంకుకు తాకట్టుపెట్టారు. తన ఆస్తులతోపాటు భార్య తేజస్విని ఆస్తులను సైతం తాకట్టుపెట్టారు శ్రీభరత్. 

విజయనగరం జిల్లా గరివిడిలో మెస్సర్ వీబీసీ రెన్యువబుల్ ఎనర్జీ పవర్ ప్లాంట్ కోసం తన భూములను విశాఖపట్నం జిల్లా సీతమ్మధారలోని ఆంధ్రాబ్యాంకుకు తాకట్టుపెట్టారు శ్రీభరత్. 2016లో 15.78 కోట్లు రుణం తీసుకున్నారు. 

అందుకుగానూ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన విజయనగరం జిల్లాలోని 20 ఎకరాల భూమితోపాటు విశాఖపట్నం జిల్లా మధురవాడలోని రెండు స్థలాలను తనఖా పెట్టారు. అయితే కొన్ని వాయిదాలు సక్రమంగా చెల్లించిన మెస్సర్ సంస్థ అనంతరం చెల్లింపులో అలసత్వం ప్రదర్శించింది. 

బ్యాంకు రుణాలకు సంబంధించి వాయిదాలు చెల్లించకపోవడంతో సంస్థకు జూలై 8న డిమాండ్ నోటీసు జారీ చేసింది ఆంధ్రాబ్యాంక్. అయితే సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆంధ్రాబ్యాంకు ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. 

అంతేకాదు మరోసారి గడువు ఇచ్చింది ఆంధ్రాబ్యాంకు. నెలరోజుల్లోగా సొమ్మును చెల్లించి ఆస్తులను విడిపించుకోవాలని లేనిపక్షంలో వేలం వేయాల్సి వస్తుందని హెచ్చరించింది ఆంధ్రాబ్యాంకు సిబ్బంది. 

కొన్నివాయిదాలు చెల్లించగా ఇంకా రూ.13 కోట్ల 65 లక్షల 69 వేలకు పైగా బకాయిలు ఉన్నట్లు నోటీసులో స్పష్టం చేసింది ఆంధ్రాబ్యాంకు. నెలరోజుల్లోగా సొమ్మును వడ్డీతో సహా చెల్లించి ఆస్తులను విడిపించుకోవాలని ఆంధ్రాబ్యాంకు స్పష్టం చేసింది.  

ఇకపోతే ఆస్తుల స్వాధీనానికి సంబంధించి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని మెస్సర్ సంస్థ డైరెక్టర్ శ్రీభరత్ స్పష్టం చేస్తున్నారు. తమ సంస్థ విద్యుత్ ను ప్రభుత్వం తీసుకుంటుందని అయితే ప్రభుత్వం నుంచి రూ.3కోట్లు బకాయిలు రావాల్సి ఉందని చెప్తున్నారు. బకాయిలు విడుదల కాకపోవడంతోనే వాయిదాలు చెల్లించలేకపోయామని తెలిపారు. 

హిందూపూర్ ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్. బాలయ్య చిన్నకుమార్తె తేజస్విని భర్త. అంతేకాదు గీతమ్ విద్యాసంస్థల అధినేత, దివంగత నేత ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీభరత్. అంతేకాదు మాజీమంత్రి నారాలోకేష్ కు స్వయానా తోడల్లుడు కూడా. 

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శ్రీభరత్ విశాఖపట్నం లోక్ సభ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ మూర్తి చేతిలో ఓటమి పాలయ్యారు.  

శ్రీభరత్ ఆస్తుల స్వాధీనంపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ కుటుంబం రూ. 13 కోట్లకుపైగా బకాయి పడిందని ఆంధ్రా బ్యాంక్ పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చిందని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు దొంగల ముఠా, ఆయన బీజేపీలోకి పంపిన వాళ్లంతా కలిసి లక్ష కోట్ల మేరకు బ్యాంకులను ముంచారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇకపోతే కేంద్రప్రభుత్వం మెుండి బకాయిలపై ప్రత్యేక దృష్టిసారించింది.  

మెుత్తానికి శ్రీభరత్ ఆస్తులు స్వాధీనానికి సంబంధించి ఆంధ్రాబ్యాంకు నోటీసులు జారీ చెయ్యడంతో చంద్రబాబు కుటుంబంలో టెన్షన్ నెలకొంది. నారా లోకేష్ కు స్వయానా తోడల్లుడు కావడం, బాలకృష్ణకు శ్రీభరత్ చిన్నల్లుడు కావడంతో చంద్రబాబు ఫ్యామిలీలో ఆందోళన నెలకొంది.