Asianet News TeluguAsianet News Telugu

గంటాతో ఆపరేషన్: అసెంబ్లీలో టీడీపీ మాయం, బిజెపియే ప్రతిపక్షం?

ఏపీలో కూడా 16 మంది ఎమ్మెల్యేలను తిప్పుకుంటే బీజేపీకి ప్రతిపక్ష హోదాతోపాటు పార్టీ మరింత బలోపేతం అవుతుందని తెలుస్తోంది. ఇకపోతే ప్రతిపక్ష నేతగా గంటాను ఎన్నుకుంటే అందుకు ఆర్థిక సహాయం కూడా చేసేందుకు ఆయన వెనుకాడటం లేదని కూడా తెలుస్తోంది. 

bjp new political strategy in ap politics: ex minister ganta srinivasarao key role
Author
Amaravathi, First Published Nov 14, 2019, 6:39 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాల్లో సరికొత్త అధ్యయనానికి బీజేపీ తెరలేపుతోందని తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాం తమ పార్టీయేనని పదేపదే చెప్తున్న బీజేపీ దాన్ని నిజం చేసే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే వలసలకు శ్రీకారం చుట్టింది. టీడీపీలో ఉన్న కీలక నేతలను, మాజీలను ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా తమ పార్టీలో చేర్చుకుంది. 

అయితే తాజాగా ఏపీ అసెంబ్లీలో బీజేపీ అడుగుపెట్టాలని భావిస్తోందట. అందేంటి ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ ఎలా అడుగుపెడుతుందనా...? అందుకు వ్యూహాన్ని కూడా సిద్ధం చేసిందట బీజేపీ. 

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఎలాంటి షరతులు లేకుండా బీజేపీ చేర్చుకోవాలని ప్రణాళిక రచిస్తోందని తెలుస్తోంది. రాజ్యసభలో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ కూడా అమలు చేయాలని భావిస్తోందట. 

టీడీపీ రాజ్యసభ్యులు నలుగురు బీజేపీలో చేరుతూ టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఏపీలో కూడా 16 మంది ఎమ్మెల్యేలను బీజేపీ చేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తోందట. 

అందుకు అవసరమైతే అన్ని అస్త్రాలను ప్రయోగించాలని చూస్తోందట బీజేపీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా బీజేపీకి దక్కాలంటే 16 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని టీడీపీ విభాగాన్ని బీజేపీలో విలీనం చేసేలా వ్యూహాన్ని సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. 

అంతేకాదు బీజేపీ వేసిన పాచిక విజయవంతం అయితే ఏపీ ప్రతిపక్ష నేత హోదా మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇవ్వాలని కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే బీజేపీ జాతీయ నాయకత్వంతో గంటా శ్రీనివాసరావు చర్చలు కూడా జరిపారు. 

తనతో కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని సరిగ్గా ప్రయత్నిస్తే 16 మంది పార్టీ మారడంలో ఎలాంటి సందేహం లేదని గంటా స్పష్టం చేశారట. అందువల్లే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరకుండా బీజేపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. 

ఇకపోతే టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు జగన్ ఇష్టపడటం లేదు. అందుకు ససేమిరా అంటున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాతే టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని కండీషన్ పెట్టారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఉపఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎలా ఉంటాయో అన్న అయోమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారట. అయితే బీజేపీలో చేరితే గనుక రాజీనామా చేయాల్సిన అవసరం లేకపోగా...కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో తమ పరిస్థితి మరింత బాగుంటుందని కొందరు ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్, జేడీఎస్ లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలను బీజేపీ తమవైపునకు తిప్పుకుంది. అదే తరహాలో ఏపీలో కూడా 16 మంది ఎమ్మెల్యేలను తిప్పుకుంటే బీజేపీకి ప్రతిపక్ష హోదాతోపాటు పార్టీ మరింత బలోపేతం అవుతుందని తెలుస్తోంది. ఇకపోతే ప్రతిపక్ష నేతగా గంటాను ఎన్నుకుంటే అందుకు ఆర్థిక సహాయం కూడా చేసేందుకు ఆయన వెనుకాడటం లేదని కూడా తెలుస్తోంది. 

మెుత్తానికి బీజేపీ వ్యూహం గనుక సక్సెస్ అయితే జగన్ కు మరోకొత్త ప్రత్యర్థి రెడీ అవుతున్నట్లేనని చెప్పుకోవాలి. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తుపై గెలిచి బీజేపీలో విలీనం అయ్యి ఏపీ అసెంబ్లీలోకి బీజేపీ ఎమ్మెల్యేలు అడుగుపెట్టబోతున్నారన్నమాట. 

ఇదిగనుక జరిగితే ఏపీ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రచారం జరరుగుతున్నట్లు బీజేపీ అలాంటి వ్యూహమే రచిస్తుందా....?గంటా సీఎం జగన్ కు కాబోయే ప్రత్యర్థి కాబోతున్నారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

ఈ వార్తలు కూడా చదవండి

టీడీపీ ఖాళీ కావడం ఖాయం:సోము వీర్రాజు సంచలనం

చంద్రబాబుకు షాక్ ఖాయమేనా...? రామ్ మాధవ్ తో గంటా భేటీ

Follow Us:
Download App:
  • android
  • ios