తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా జరుగుతున్న ఐటీ దాడులపై ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని మూడు ఇన్‌ఫ్రా కంపెనీలపై జరిగిన దాడుల్లో రూ.2 వేల కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు ఐటీ శాఖ తెలిపింది.

ఓ ప్రముఖ వ్యక్తి ప్రైవేట్ సెక్రటరీ ఇంటిపై చేసిన దాడిల్లో కూడా కీలకమైన సాక్ష్యాలు లభించాయని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మాజీ పీఎస్ శ్రీనివాసరావు ఇంట్లో ఐటి అధికారులు దాదాపు ఐదు రోజుల పాటు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాలకు సంబంధించి ఐటి అధికారులు ఆ సమయంలో పెదవి విప్పలేదు.

హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖ, ఢిల్లీ, పుణే సహా 40 చోట్ల 5 రోజుల పాటు జరిగిన సోదాల్లో నకిలీ బిల్లుల ద్వారా సదరు ఇన్‌ఫ్రా కంపెనీలు పెద్ద ఎత్తున ఆర్ధిక లావాదేవీలకు పాల్పినట్లుగా తెలిపింది.

ప్రధానంగా ఆర్‌వీఆర్ ఇన్‌ఫ్రా, ఆర్కే కంపెనీలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామని ఐటీ శాఖ చెప్పింది. దీనితో పాటు కోట్లాది రూపాయలను విదేశాలకు మళ్లించినట్లుగా ఆధారాలు లభించాయని వెల్లడించింది.

బోగస్ కంపెనీల పేర్లతో లావాదేవీలు నిర్వహించిన ఇన్‌ఫ్రా కంపెనీలలో రూ. 2 వేల కోట్ల కు సంబంధించిన మల్టీపుల్ ఎంట్రీలను గుర్తించామని ఐటీ శాఖ వివరించింది. రూ.2 కోట్లు టర్నోవర్ దాటని కంపెనీలు సృష్టించి నిధులను బదలాయించారని.. ఈ క్రమంలో చాలా షెల్ కంపెనీలకు నిధులు వెళ్లాయని తెలిపింది.