జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయం భలే విచిత్రంగా ఉంది. పైకి చెప్పేదొకటి. లోపల చేసేదొకటి. దాంతో మామూలు జనాలే కాదు చివరకు పవన్ అభిమానులు సైతం అయోమయంలో పడిపోతున్నారు. ‘చలొరే చలొకే చల్’ కార్యక్రమంలో భాగంగా పవన్ మొదలుపెట్టిన అనంతపురం జిల్లా యాత్రే అందుకు నిదర్శనంగా నిలిచింది.

శనివారం నాడు పవన్ అనంతరపురం జిల్లా యాత్రను ఆరంభించారు. జిల్లాలోకి అడుగుపెట్టిన తర్వాత పవన్ టిడిపి ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరి ఇంటికి వెళ్ళి కలిసారు. తర్వాత ఆదివారం ఉదయం మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్ళి బ్రేక్ ఫాస్ట్ చేశారు. తర్వాత కదిరి పర్యటనలో ఫిరాయింపు ఎంఎల్ఏ అత్తార్ చాంద్ భాష ఇంటికి వెళ్ళారు. పై మూడు సందర్భాల్లోనూ పవనే టిడిపి ఎంఎల్ఏల ఇళ్ళకు వెళ్ళారు కానీ వాళ్ళెవరూ వచ్చి పవన్ ను కలవలేదు.

పరిటాల సునీత ఇంటికి వెళ్ళటాన్ని పవన్ సమర్ధించుకున్న కారణం కూడా విచిత్రంగా ఉంది. రైతుల సమస్యలు తెలుసుకునేందుకే మంత్రి ఇంటికి వెళ్ళినట్లు చెప్పారు. అంటే గడచిన మూడున్నరేళ్ళల్లో రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు ఏవీ పవన్ కు తెలీవనే అనుకోవాలా?

అసలే చంద్రబాబునాయుడుకు మద్దతుగానే పవన్ పర్యటనలు ఉంటున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయ్. పవన్ వైఖరి కూడా అందుకు తగ్గట్లుగానే ఉంటోంది. ఇటువంటి నేపధ్యంలోనే పవన్ మొదలుపెట్టిన అనంతపురం యాత్ర ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలాగ మారిందనే విమర్శలు మొదలయ్యాయి. నిజంగా జిల్లాలో సమస్యలు, రైతుల బాధలు తెలుసుకోవాలంటే కలవాల్సింది మంత్రి, టిడిపి ఎంఎల్ఏలను కాదు. నేరుగా రైతులను లేదా ప్రజాసంఘాలను కలవాలి. అంతే కానీ మంత్రినో లేకపోతే ఎంఎల్ఏ అందులోనూ ఫిరాయింపు ఎంఎల్ఏని కలిసి సమస్యల గురించి మాట్లాడానని పవన్ చెబితే ఎవరైనా నమ్ముతారా?