అమరావతి: తాను  తప్పు మాట్లాడలేదని ఏపీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆయన పునరుద్ఘాటించారు. 

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలో డిక్లరేషన్ విధానాన్ని ఎత్తివేయాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు. వెంకటేశ్వరస్వామి భక్తుడిగా ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన చెప్పారు.

ఆరు కోట్ల ఆంధ్రుల ప్రతినిధిగా సీఎం జగన్ తిరుమల వెళ్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.  హిందూవుల ప్రతినిధిగానే జగన్ తిరుమలకు వెళ్లడం లేదని ఆయన చెప్పారు. 

తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం చేయాలనడం నీచ రాజకీయమని ఆయన అభిప్రాయపడ్డారు.ఏపీలో అన్ని మతాలు, కులాలవారున్నారని ఆయన గుర్తు చేశారు. సోము వీర్రాజుకు, చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలా అని ఆయన ప్రశ్నించారు. 

also read:కొడాలి నాని వ్యాఖ్యలు:విపక్షాల కౌంటర్, హీటెక్కిన రాజకీయాలు

తిరుమలలో డిక్లరేషన్ వివాదంపై  మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారం రేపాయి. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ, టీడీపీ, జనసేనలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి.ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కూడ డిమాండ్ చేశాయి.

తిరుమలలో సీఎం జగన్ డిక్లరేషన్ పై సంతకం చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. అయితే గతంలో పలుమార్లు  జగన్  తిరుమలకు వెళ్లిన సమయంలో టీడీపీ ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదని వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు.