హైదరాబాద్: మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకొన్నారు. ఇటీవల కాలంలో బీజేపీ నేతలతో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సమావేశమయ్యారు. బీజేపీలో చేరుతారని ప్రచారం సాగిన తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. 

ఈ నెల 3వ తేదీన చంద్రబాబునాయుడుతో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత టీడీపీలోనే కొనసాగాలని ఆదినారాయణరెడ్డి నిర్ణయం తీసుకొన్నారు.

ఈ నెల 19, 20 తేదీల్లో కడపలో టీడీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.ఈ సమావేశానికి నియోజకవర్గాల వారీగా నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పాల్గొంటారు.

మంత్రిగా ఉన్న సమయంలో జగన్‌ను లక్ష్యంగా చేసుకొని తాను విమర్శలు చేసిన నేపథ్యంలో  రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరాలని భావించాడని ప్రచారం సాగింది.ఇందులో భాగంగానే హైద్రాబాద్ పర్యటనకు వచ్చిన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను ఆదినారాయణరెడ్డి కలిశారు.

అయితే చంద్రబాబునాయుడుతో భేటీ అయిన తర్వాత ఆదినారాయణరెడ్డి తన వైఖరిని మార్చుకొన్నట్టుగా చెబుతున్నారు. పార్టీ అండగా ఉంటుందని ఆదినారాయణరెడ్డికి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. 

పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటానని కూడ ఆదినారాయణ రెడ్డి చంద్రబాబుకు హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు.ఈ నెల 19వ తేదీన జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ నెల 20వ తేదీన ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో బాబు భేటీ కానున్నారు.టీడీపీని వీడి ఇతర పార్టీల్లో చేరే వారిని బుజ్జగించాలని కూడ  పార్టీ నాయకత్వం భావిస్తోంది.

జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుండి 2004, 2009, 2014 ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా అంతకుముందు రెండు దఫాలు కాంగ్రెస్ అభ్యర్ధిగా రామసుబ్బారెడ్డిపై విజయం సాధించారు. 2014 తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల్లో ఆదినారాయణరెడ్డి వైఎస్ఆర్‌సీపీని వీడి టీడీపీలో చేరారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఆదినారాయణరెడ్డి మంత్రిగా పనిచేశారు.

ఈ నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డికి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 2019 ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు నుండి ఎమ్మెల్యేగా, ఆదినారాయణరెడ్డిని ఎంపీగా బరిలోకి దింపారు. వీరిద్దరూ కూడ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

సంబంధిత వార్తలు

బాబుకు ఆది షాక్: జేపీ నడ్డాతో భేటీ, బీజేపీలోకి?