హైదరాబాద్:ఏపీ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోమవారం నాడు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్  జేపీ నడ్డాను కలిశారు. కడప జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డి జేపీ నడ్డాను బీజేపీ కార్యాలయంలో కలిశారు. ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకొంది.

కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉంది. బీజేపీ నేతతో కలిసి ఆదినారాయణరెడ్ది సోమవారం నాడు ఉదయం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  కడప ఎంపీ స్థానం నుండి ఆదినారాయణరెడ్డి  టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2014-2019 మధ్య కాలంలో వైఎస్ఆర్‌సీపీ నుండి టీడీపీలో ఆదినారాయణరెడ్డిని చేర్పించడంలో  ఎంపీ సీఎం రమేష్ కీలక పాత్ర పోషించారు.

సీఎం రమేష్ రెండు మాసాల క్రితం టీడీపీని వీడి బీజేపీలో చేరారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది.ఈ తరుణంలో ఆదినారాయణరెడ్డి జేపీ నడ్డాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

ఏపీ రాష్ట్రానికి చెందిన పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని కమలదళం చెబుతుంది.  ఇప్పటికే కొందరు నేతలు బీజేపీలో చేరారు. మరికొందరు నేతలు కూడ త్వరలోనే చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ తరుణంలో జేపీ నడ్డాతో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సమావేశం కావడం రాజకీయంగా చర్చకు దారితీసింది.