ఫోన్ ట్యాపింగ్  పై   విచారణ  కోరుతూ  కేంద్రానికి  రాష్ట్ర ప్రభుత్వం  లేఖ  రాయాలని  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్  రెడ్డి  కోరారు.  

నెల్లూరు: తాను మళ్లీ వైసీపీ నుండి పోటీ చేయనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. గురువారంనాడు నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన తలరాత ఎలా ఉంటుందో అలా జరుగుతుందన్నారు. దేవుడు, ప్రజల ఆశీస్సులతో ముందుకెళ్తానని ఆయన చెప్పారు. నెల్లూరు రూరల్ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా అదాల ప్రభాకర్ రెడ్డి అని చెబుతున్నారన్నారు. అదాల ఏ పార్టీలో ఉంటున్నారో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగా అన్ని పార్టీల కు అదాల ప్రభాకర్ రెడ్డి తిరగొద్దని ఆయన సూచించారు.

వేల కోట్ల ఆస్తులున్న మీతో ఢొకొట్టడానికి తానుసిద్దమని ఆయన చెప్పారు. తాను ఎవరిని శత్రువుగా భావించనన్నారు. పోటీదారుడిగానే భావిస్తానని ఆయన చెప్పారు. మేయర్ సహ 11 మంది కార్పోరేటర్లు తన వెంటే ఉన్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. 

also read:అది ఫోన్ ట్యాపింగ్ కాదు.. నా సెల్ నుంచి ‘కాల్ రికార్డింగ్’షేర్ అయ్యింది : కోటంరెడ్డి మిత్రుడు రామశివారెడ్డి

 ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై విచారణ జరపాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కోరడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మంత్రులు, ఎంపీలు అభద్రతాభావంలో ఉన్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఫోన్లు మాట్లాడుకొనే ధైర్యం చేయలేకపోతున్నారని ఆయన ఆరోపించారు.. విచారణ జరిపితే మిగిలినవారి ఫోన్ ట్యాపింగ్ బయటపడుతుందన్నారు. మరో ఆరు మాసాల తర్వాత చిత్ర విచిత్రాలు చూస్తారని ఆయన చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై తన మిత్రుడికి సజ్జల రామకృష్ణారెడ్డి ఇవ్వాల్సిన స్క్రిప్ట్ ఇవ్వలేకపోయారన్నారు.