Asianet News TeluguAsianet News Telugu

జగన్‌తో పవన్ దోస్తీ, ఏమైనా జరగొచ్చు: సబ్బం హరి

 ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని  అనుకొంటే  ఇవ్వలేమని ప్రధానమంత్రి మోడీ ఇప్పటికైనా స్పష్టం చేయాలని మాజీ ఎంపీ సబ్బం హరి  డిమాండ్ చేశారు.సిద్దాంతాలకు, నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారు

I will contest in 2019 elections says former MP Sabbam Hari


న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని  అనుకొంటే  ఇవ్వలేమని ప్రధానమంత్రి మోడీ ఇప్పటికైనా స్పష్టం చేయాలని మాజీ ఎంపీ సబ్బం హరి  డిమాండ్ చేశారు.సిద్దాంతాలకు, నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారు. 2019 ఎన్నికల్లో తాను అసెంబ్లీకి పోటీ చేయనున్నట్టు చెప్పారు.2019 ఎన్నికలకు ముందు ఏపీ రాష్ట్రంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలున్నాయన్నారు.ఎవరు ఎవరితో కలుస్తారో చెప్పలేమన్నారు.

శుక్రవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.  ప్రత్యేక హోదా కాదని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని  బీజేపీ ముందుకు వచ్చిందన్నారు. కేంద్రంలో  మిత్రపక్షంగా ఉన్నందున మూడేళ్ల పాటు ముందుకు సాగాలనే ఉద్దేశ్యంతో ఆనాడు ప్రత్యేక ప్యాకేజీని బాబు ఒప్పుకోని ఉండవచ్చని  సబ్బం హరి అభిప్రాయపడ్డారు.

దేశంలో అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోందని హరి చెప్పారు. ఈ మేరకు బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. గతంలో పార్లమెంట్ వేదికగా బీజేపీ ప్రత్యేక హోదాతో పాటు పలు డిమాండ్లను ప్రస్తావించిన అంశాలను ఆయన గుర్తు చేశారు.

రాజకీయలబ్దికోసం రంగస్థలం మీద బీజేపీ నాటకం ఆడుతోంటే దాన్ని తిప్పికొట్టేందుకు టీడీపీ కూడ ఎత్తులు వేస్తోందన్నారు.బీజేపీ కూడ అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే వ్యవహరిస్తోందని ఏపీ విషయంలో తేలిందన్నారు.

సుప్రీంకోర్టులో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేస్తే ఇప్పుడు వైసీపీ, జనసేనలు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన కోరారు.
2019 ఎన్నికలకు నెల రోజుల ముందు అనేక ఊహించని పరిణామాలు చోటుచేసుకొనే అవకాశం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో కలుస్తారా, జగన్‌తో పవన్ కలిసి పోటీ చేస్తారా అనేది తేలాల్సి ఉందన్నారు. అయితే ఊహించని పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలు లేకపోలేదన్నారు.


టీడీపీ, బీజేపీ లు కలిసి పోటీ చేస్తే పార్లమెంట్ కు పోటీ చేయాలని తాను భావించానన్నారు. కానీ, వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయనున్నట్టు చెప్పారు. అయితే టీడీపీ లేదా మరో పార్టీ తరపున పోటీ చేస్తానని ఆయన చెప్పారు.

అయితే తాను పోటీ చేయాలనుకొనే పార్టీ  ఓటమి పాలయ్యే అవకాశం ఉంటే తాను ఆ పార్టీ తరపున పోటీ చేయనని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు తాను పోటీ చేయాలనుకొన్న పార్టీ విజయం సాధిస్తోందని భావిస్తే... ఆ పార్టీ తనకు నచ్చకపోతే తాను ఆ పార్టీ నుండి  పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు.

తాను చంద్రబాబునాయుడును సమర్ధించే ఉద్దేశ్యంతో మాట్లాడడం లేదన్నారు.వాస్తవాలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశ్యంతోనే తాను మీడియాలో మాట్లాడుతున్నట్టు ఆయన చెప్పారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios