బాబుతో మరోసారి సమావేశమౌతానంటున్న గంటా శ్రీనివాసరావు

విశాఖ: విశాఖలో చోటు చేసుకొన్న అన్ని పరిణామాలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్ళినట్టు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఈ పరిణామాలపై ముఖాముఖి కలిసి చర్చిద్దామని తనకు హమీ ఇచ్చారన్నారు.

విశాఖలో సీఎం పర్యటన సందర్భంగా భోజన విరామ సమయంలో సీఎం చంద్రబాబుతో మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం నాడు సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు.

జిల్లాలో చోటు చేసుకొన్న పరిణామాలపై అన్ని విషయాలను చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్ళినట్టు ఆయన చెప్పారు. ఏ కారణాలతో తాను కేబినేట్ సమావేశానికి దూరం కావాల్సి వచ్చిందనే విషయంతో పాటు ఇతరత్రా వ్యవహరాలను కూడ గంటా శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు వివరించినట్టు సమాచారం.

ఈ విషయాలన్ని విన్న తర్వాత ముఖాముఖి మరోసారి అన్ని విషయాలపై చర్చిద్దామని సీఎం హమీ ఇచ్చారని గంటా తెలిపారు. విశాఖలో అభివృద్ది పనుల విషయమై కూడ ముఖ్యమంత్రితో చర్చించినట్టు ఆయన తెలిపారు. విశాఖ పర్యటన ముగించుకొని అమరావతికి బయలుదేరి వెళ్ళే ముందు విశాఖ ఎయిర్‌పోర్టులో సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారని ఆయన తెలిపారు.