అనంతపురం: అదనపు కట్నం కోసం భర్త వేధించినా ఆమె భరించింది. కొడుకుతో సహా ఇంట్లోంచి గెంటేసినా నా ఖర్మ ఇంతేనని సహించింది. ఇంత జరిగి పుట్టింటికి వెళ్లినా ఇంకా భర్త పిలుపు కోసం ఎదురుచూస్తుండగా అతడు మరో వివాహం చేసుకున్నాడని  తెలిసింది. శారీరక బాధలను తట్టుకున్నా తన భర్త మరో మహిళ సొంతమయ్యాడన్న మానసిక వేధనను తట్టుకోలేక పోయింది. దీంతో వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. 

ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాయదుర్గం మండలం ఆవులదట్లకు చెందిన పృథ్వీరాజ్‌ నాయక్‌-సుజాత భార్యాభర్తలు. వీరికి ఏడేళ్ల క్రితం పెళ్లి కాగా ఒక కుమారుడు ఉన్నాడు. అయితే అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వారు వేధించి ఇంట్లోంచి బయటకు పంపించడంతో సుజాత తన కొడుకుతో కలిసి పుట్టింట్లో వుంటోంది. 

ఈ క్రమంలో పలుమార్లు పెద్దమనుషుల వద్ద పంచాయితీ జరిగిన భార్యను తీసుకెళ్లడానికి పృథ్విరాజ్ అంగీకరించలేదు. అంతేకాకుండా కట్నం కోసం కక్కుర్తి పడి మరో మహిళను వివాహం చేసుకున్నాడు.  భర్త రెండో పెళ్లి చేసుకున్న విషయం సుజాత తట్టుకోలేకపోయింది. మనస్తాపంతో దారుణ నిర్ణయం తీసుకుంది. 

శనివారం రాత్రి పొద్దుపోయాక పంటకోసం తీసుకువచ్చిన పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబసభ్యులు వెంటనే అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది.