తనను కాదని.. భార్య మరో వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని భర్త జీర్ణించుకోలేక పోయాడు. ఇలాంటివి మానుకోవాలని భార్యను హెచ్చరించాడు. అనంతరం భార్య ప్రియుడ్ని అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వి.కోటలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తిమ్మరాజుపురం గ్రామానికి చెందిన రవి(30) రోజు కూలీగా పనిచేస్తున్నాడు. అతనికి వచ్చే సంపాదన సరిపోకపోవడంతో భార్య లత(27) ను కూడా శివ అనే తాపీ మేస్త్రి కింద పనికి కుదిర్చాడు. అయితే... పనికోసం వెళ్లిన లతకు.. శివతో వివాహేతర సంబంధం ఏర్పడింది. తరచూ ఇద్దరూ ఫోన్లు కూడా మాట్లాడుకుంటూ ఉండేవారు.

ఈ విషయం ఒకరోజు రవికి తెలిసింది. దీంతో... భార్యను ఇలాంటి పనులు ఇంకోసారి చేయవద్దని హెచ్చరించాడు. అనంతరం భార్యతో కలిసి పథకం ప్రకారం... శివను ఓ ప్రాంతానికి రప్పించాడు. తన భార్యతో శివ మాట్లాడుతుండగా... వెనక నుంచి కర్రలతో కొట్టి చంపాడు. అనంతరం శవాన్ని మూటగట్టి ఊరిచివరకు తీసుకువెళ్లి పెట్రోల్ పోసి తగలపెట్టాడు.

సగం కాలిన శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తొలుత గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు తర్వాత ఆ శవం తాపీమేస్త్రి శివదిగా గుర్తించారు. తర్వాత అతని ఫోన్ కాల్ డేటా ఆధారంగా.. లత, శివలను పట్టుకుని నిలదీశారు. పోలీసుల విచారణలో వారు నిజం అంగీకరించడంతో.. వారిని అరెస్టు చేశారు.