మరదలిపై కన్నేసిన ఓ భర్త కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు. ఆమెతోనే సూసైడ్ నోట్ రాయించి అనంతరం హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం అలేబాదు తండాకు చెందిన రవి నాయక్‌కు, గోరుమాను కొండ తండాకు చెందిన సుశీలా బాయితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది.

తన కంటే భార్య పొట్టిగా ఉండటాన్ని అవమానంగా భావించిన రవి నాయక్ మరదలిపై (భార్య సోదరిపై) కన్నేశాడు. ఈ క్రమంలో ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని భావించాడు.

ఈ విషయంపై తరచూ భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగేది. భార్య ఉండగా రెండో పెళ్లి సాధ్యం కాదని భావించిన రవి నాయక్ ఆమెను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగా దగ్గరి బంధువు రేఖా నాయక్ సాయం తీసుకున్నాడు.

పథకం ప్రకారం.. రేఖా నాయక్ ద్వారా కట్టుకథ అల్లించి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భార్యతోనే లేఖ రాయించాడు. ఈ లేఖను ఇంట్లో ఓ చోట దాచి ఈ నెల 14న భార్యను తనతో పాటు జీవాలు మేపేందుకు అడవికి తీసుకెళ్లాడు.

అక్కడ ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం సుశీలాబాయిపై బండరాయితో మోది హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని లోయలోకి తోసి ఏం తెలియనట్లు ఇంటికి వచ్చాడు. వెంటనే తన భార్య కనిపించడం లేదని జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్లు ’’ లేఖ ఇంట్లో ఉంచిందని చెప్పాడు.

సూసైడ్ నోట్‌లో మృతురాలి చేతిరాత, సంతకం అన్నీ తమ కుమార్తెవని ఆమె తల్లిదండ్రులు ధ్రువీకరించారు. అయితే అల్లుడిపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదే సమయంలో మరుసటి రోజు పశువుల కాపర్లు కొండల్లోని మహిళ మృతదేహం వున్న విషయాన్ని పోలీసులకు చెప్పడంతో ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు హత్య  కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా మంగళవారం నిందితులను అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించగా, నేరం అంగీకరించాడు.