ఎంతో ఆనందంగా మెట్టినింట అడుగుపెట్టింది. అయితే.. ఆ ఆనందం ఆమెకు ఎక్కువ కాలం నిలవలేదు. కట్టుకున్న భర్త కాలయముడిలా మారి వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. తనకు అదనంగా కట్నం ఇస్తేనే తప్ప.. కాపురం చేయనంటూ మొండికేశాడు.  దీంతో.. భర్త వేధింపులు తట్టుకోలేకపోయిన ఆ మహిళ బిడ్డతో సహా అత్తారింటి ముందు ఆందోళన చేయడం మొదలుపెట్టింది. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కడపకు చెందిన గాయత్రికి అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం కి చెందిన గుర్రం దీపక్‌కుమార్‌తో 2018 డిసెంబర్‌ 27న వివాహమైంది. అప్పట్లో రూ.20లక్షలు కట్నం, రూ.10 లక్షలు విలువ చేసే బంగారు నగలను అందజేశారు. దీపక్‌కుమార్‌ బెంగళూరులోని ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుండేవాడు. పెళ్లి అయినప్పటి నుంచి అదనపు కట్నం కోసం భార్యను వేధించేవాడు. రూ. కోటి తీసుకురాకపోతే విడాకులు ఇస్తానంటూ బెదిరించేవాడు.

కాగా.. తర్వాత గర్భం దాల్చిన గాయత్రి పురుడు కోసం పుట్టింటికి వెళ్లింది. అనంతరం దీపక్‌కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి.. గంజాయి వ్యాపారం మొదలుపెట్టాడు. విషయం తెలిసిన వెంటనే గంజాయి వ్యాపారం చేయడం తప్పని చెబితే వినకపోగా భార్యను మరింతగా వేధించడం మొదలుపెట్టాడు. గత ఏడాదే భార్య డెలివరీ అయి పండంటి బిడ్డకు జన్మనిచ్చినా చూసేందుకు కూడా వెళ్లలేదు. భర్త తనను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని గాయత్రి కడప పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అక్కడి పోలీసులు భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చి.. చక్కగా కాపురం చేసుకోవాలని సూచించారు.

కౌన్సిలింగ్ తర్వాత కూడా అతనిలో మార్పు రాకపోగా.. రూ.కోటి తీసుకువస్తేనే కాపురం చేస్తానంటూ మొండికేసి కూర్చున్నాడు. కనీసం ఆమెను అత్తారింట్లో అడుగు కూడా పెట్టనివ్వలేదు. దీంతో ఆమె ఆ ఇంటి ముందే పాపతో కలిసి ఆందోళన చేపట్టింది. తన భర్త గంజాయి వ్యాపారం చేస్తున్నాడని, అది తప్పని చెప్పినందుకు తనను ఎలాగైనా వదిలించుకునేందుకు అదనపు కట్నం పేరిట వేధిస్తున్నారని గాయత్రి ఆవేదన వ్యక్తం చేసింది.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.